10 జిల్లాల ప్రతిపాదికనే టీఆర్టీ

హైకోర్టు ఆదేశాల మేరకు  పాత 10 జిల్లాల ప్రతిపాదికనే టీఆర్టీని నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమైన ఆయన, ఉద్యోగాల నియామక ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

31 జిల్లాల ప్రాతిపదికన ఇటీవలే 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయిందని కడియం శ్రీహరి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు టీచర్ పోస్టులను 10 జిల్లాల వారీగా విభజించామని చెప్పారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను టీఎస్‌పీఎస్సీకి పంపుతున్నామని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్‌ను జారీ చేస్తుందన్నారు. కొత్త నోటిఫికేషన్ ఇస్తారా? సవరించి ఇస్తారా? అనే విషయాన్ని టీఎస్‌పీఎస్సీ చూసుకుంటుందని కడియం స్పష్టం చేశారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాలా? వద్దా? అనేది టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరూ నిరాశ చెందొద్దని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. కొందరు రాజకీయ కొలువుల కోసం కొలువులకై కొట్లాటలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. రాజకీయాల కోసం ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కడియం స్పష్టం చేశారు.