హైదరాబాద్ ప్రతిష్ట విశ్వవ్యాప్తం

జీఈఎస్ ప్రారంభోత్సవంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడికి సలహాదారు ఇవాంక.. ఈ ఇద్దరూ తమ ఉపన్యాసంలో టీహబ్ గురించి ప్రస్తావించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అని ఏకంగా ప్రధాని ప్రశంసించారు. టీఎస్ ఐపాస్ అనే విప్లవాత్మక పాలసీ గురించి సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇక, అవకాశం దొరికినప్పుల్లా మంత్రి కేటీఆర్ ప్రతి వేదిక మీద టీ హబ్, టీఎస్ ఐపాస్, మహిళా పారిశ్రామికవేత్తలకు అందజేస్తున్న ప్రోత్సాహం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనలు, పరిశ్రమలకు అందజేస్తున్న సహకారం గురించి ఎంతో ఓపికగా వివరించారు. జీఈఎస్ సదస్సులో వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా మంత్రి కేటీఆర్ వదులుకోకుండా.. తెలంగాణ అనుసరిస్తోన్న విధానాల గురించి విపులాత్మకంగా చెప్పారు. అంతెందుకు, ప్రపంచ దిగ్గజ మహిళలతో జరిగిన ప్లీనరీలోనూ.. చందాకొచ్చర్ స్వయం సహాయక బృందాల గురించి వివరిస్తుండగా.. తెలంగాణలో కూడా ఇరవై లక్షల మంది దాకా ఎస్‌హెచ్‌జీ గ్రూపులున్నాయని వెల్లడించారు. విదేశీ ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక విధానాల గురించి విడమరిచి వివరించడంలో మంత్రి కేటీఆర్ సఫలం అయ్యారు.

తెలంగాణ రాష్ట్రమంటే ఇంతవరకు పరిచయం లేని దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, యూరప్ సంస్థలకు..  హైదరాబాద్ అంటే ఏమిటో తెలిసొచ్చింది. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన నగరమని..ఇక్కడి వాతావరణం మెరుగ్గా ఉండటమే కాకుండా ప్రజలూ ప్రేమతో పలకరిస్తారని అర్థమైంది. ప్రోత్సాహకర ప్రభుత్వం రాష్ట్రంలో ఉండటం వల్ల.. ఆయా సంస్థలు దక్షిణాసియాలో అడుగుపెట్టాలంటే ముందుగా గుర్తుకు తెచ్చుకునేది హైదరాబాద్ నే. మూడు రోజుల కార్యక్రమానికి విచ్చేసిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ఫైనాన్స్ సంస్థల మధ్య లావాదేవీలు కుదరడం విశేషం. ఐరన్ బిస్కట్స్ అమ్మే ఓ విదేశీ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి, ఒక అమెరికన్ కంపెనీతో డీల్ కుదిరినట్లు సమాచారం. ఇలాంటి అనేక ఒప్పందాలు పలు దేశ, విదేశీ స్టార్టప్‌ల మధ్య జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రం ప్రారంభించిన టీ హబ్, పరిశ్రమలకు అందిస్తోన్న ప్రోత్సాహం కారణంగా.. పలు విదేశీ స్టారప్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు.. భాగ్యనగరంలో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆస్కారమున్నది. ప్రధానంగా బిగ్ డేటా, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆన్ థింగ్స్, నెట్‌వర్కింగ్, ఐటీ, ఐటీఈఎస్, ఫైనాన్షియల్, లీగల్, సినిమా, వేస్ట్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ వంటి రంగాలకు చెందిన సంస్థలు నగరానికి విచ్చేసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కాకపోయినా, రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో అద్భుతమైన ప్రగతి సాధించడానికి ఆస్కారమున్నది. హైదరాబాద్‌లోని మౌలిక సదుపాయాలు, ఇక్కడి వాతావరణం మెరుగ్గా ఉందని అమెరికా ప్రత్యేక సలహాదారుడొకరు అన్నారు. ఆర్థిక, ఆరోగ్య, క్రీడా, సౌర విద్యుత్తు, వ్యర్థాల నిర్వహణ వంటి రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయని తెలిపారు. క్రౌడ్ ఫండింగ్, బూట్ స్ట్రాపింగ్, మొబిలిటీ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్, సీడ్ ఫండింగ్, వెంచర్ క్యాపిటల్, స్టెమ్ టెక్నాలజీ, ఈ కామర్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివాటిలో అపారమైన అవకాశమున్నదని చెప్పారు.

జీఈఎస్ సదస్సుకి విచ్చేసిన విదేశీ ప్రతినిధుల్లో ఎవర్ని పలకరించినా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భాగ్యనగరం ఇంత గొప్పగా ఉంటుందని అనుకోలేదని.. పాశ్చాత్య నగరాలకు ఏమాత్రం తీసిపోలేదని అభిప్రాయపడ్డారు. సుమారు 140 దేశాల నుంచి విచ్చేసిన విదేశీ ప్రతినిధుల్లో దాదాపు 70 శాతం మంది హైదరాబాద్‌కి తొలిసారిగా విచ్చేసినవారే. దక్షిణ అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు మొట్టమొదటిసారిగా భాగ్యనగరంలోకి అడుగుపెట్టారు. ఈ సదస్సుకి రాకపోయి ఉంటే.. ఓ ప్రపంచ నగరాన్ని చూసే అవకాశాన్ని కోల్పోయేవాళ్లమని ముక్తకంఠంతో చెప్పారు. ఇప్పటివరకు జరిగిన ఏడు జీఈఎస్ సదస్సుల కంటే.. హైదరాబాద్‌ లో జరిగినదే అద్భుతమని మరికొందరు మనస్ఫూర్తిగా కితాబునిచ్చారు.

దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో అంతర్జాతీయ సదస్సులు జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఏ వస్తువు ఉత్పత్తి కాకపోయినా.. దుబాయ్‌లో వాతావరణం మెరుగ్గా లేకపోయినా.. ప్రపంచ నలుమూలల నుంచి విదేశీ ప్రతినిధులు గ్లోబల్ సమ్మిట్‌ లకు వెళ్తూనే ఉంటారు. ఫలితంగా, ఆయా దేశాల్లో పెట్టుబడులను పెట్టేవారి సంఖ్య పెరుగుతుంది. ఆకాశహర్మ్యాలు, వాణిజ్య సముదాయాలు, ఖరీదైన విల్లాలను డెవలపర్లు నిర్మిస్తుంటారు. అలాంటి దేశాలతో పోల్చితే మన హైదరాబాద్ ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఇక్కడి వాతావరణం, ప్రోత్సాహకర ప్రభుత్వం వంటివి ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇక్కడ నైపుణ్యం గల ఇంజినీరింగ్, ఇతర విద్యార్థులకు కొదవే లేదు. ఇలాంటి ప్రత్యేకతలను సంతరించుకున్న హైదరాబాద్‌లో గ్లోబల్ సమ్మిట్ జరగడం ఆహ్వానించదగ్గ పరిణామమంటున్నారు నిపుణులు. మన హైదరాబాద్‌లో ఇలాంటి అంతర్జాతీయ సదస్సులు ఏడాదికి కనీసం రెండు అయినా జరగాలన్నారు. ఇవాంక ట్రంప్ రావడం వల్ల నగరానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని అభిప్రాయపడ్డారు. విదేశీ ఐటీ కంపెనీల్లో పని చేసేవారు.. హైదరాబాద్‌లో ఫ్లాట్లు, విల్లాలను కొనడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పారు. మొత్తంగా ప్రపంచానికి తెలంగాణ సత్తా తెలిసేలా అత్యంత వైభవంగా జీఈఎస్ సదస్సును నిర్వహించారని ప్రశంసించారు.

జీఈఎస్ సదస్సు వల్ల ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెరిగింది. మనదేశంలోకి ప్రవేశించాలనుకునే విదేశీ కంపెనీలు.. మెట్రో నగరాలను ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ముందుగా ప్రాధాన్యతనిచ్చేది హైదరాబాద్‌కే. పైగా, ఎంత పెద్ద సముదాయం కావాలన్నా నిర్మించి ఇచ్చే సత్తా మన డెవలపర్లకు ఉంది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి.. అక్కడ్నుంచి హెచ్‌ఐసీసీ విచ్చేసినప్పుడు ప్రతి ఒక్కరికీ అర్థమై ఉంటుంది. సిస్కో ఛైర్మన్ వంటి దిగ్గజాలు నగరానికి వచ్చారంటే.. ఈ సదస్సు ఎంత సీరియస్‌గా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలు ఇక్కడికొచ్చారు. వీరు కూడా తమ తదుపరి విస్తరణను చేపట్టే క్రమంలో భాగ్యనగరానికి తప్పకుండా ప్రాధాన్యతనిస్తారు. ఇలాంటివన్నీ హైదరాబాద్ నిర్మాణ రంగానికి అత్యధిక ప్రయోజనం కలిగించేవే. ముందుగా వాణిజ్య సముదాయాల నిర్మాణం.. అక్కడ ఉద్యోగుల సంఖ్య పెరిగాక.. నివాస సముదాయాలకు గిరాకీ ఉంటుందని డెవలపర్స్ అంటున్నారు. ఇకపై హైదరాబాద్‌లో పర్యాటక, ఆతిథ్య రంగాలు బహుగా విస్తరిస్తాయని చెప్పారు.

జీఈఎస్ సదస్సు వల్ల హైదరాబాద్ నగరంలో కొత్తగా వాణిజ్య సముదాయాలకు గిరాకీ పెరుగుతుంది. అదేవిధంగా, ఆయా ప్రాంగణాల్లో ఉద్యోగులు పెరిగితే.. వారంతా ముందుగా కొనుక్కునేది సొంతింటినే. కాబట్టి, జీఈఎస్ సదస్సు వల్ల రాష్ర్టానికి మంచి రోజులు పట్టే అవకాశమున్నది. మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో కొత్త ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు ఏర్పాటయ్యే అవకాశమున్నది.  పైగా, రాష్ట్రంలోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా వి-హబ్‌ను ప్రకటించడం పట్ల రియల్టర్స్ ధన్యవాదాలు చెప్పారు.

మొత్తంగా జీఈఎస్‌ గ్రాండ్ సక్సెస్ కావడంతో హైదరాబాద్ ప్రతిష్ట విశ్వవ్యాప్తంగా వ్యాపించింది. హైదరాబాద్ నగరానికి బంగారు భవిష్యత్ ఉందని ప్రముఖ వ్యాపారులు, రియల్టర్లు ఘంటాపథంగా చెప్తున్నారు. రియల్ రంగం జోరు కొనసాగుతుందని అంటున్నారు.