హీరోయిన్‌గా సన్నీ ఎంట్రీ!

గ్లామర్ పాత్రలతో సన్నీలియోన్ బాలీవుడ్‌లో స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నది. కరెంట్‌తీగ, గరుడవేగ చిత్రాల్లో ప్రత్యేక గీతాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా ఆమె తెలుగులో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వబోతున్నది. దక్షిణభారత సంస్కృతులు, ఆచారాల నేపథ్యంలో చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి వి.సి. వడివుడయన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టీవ్ కార్నర్స్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సన్నీలియోన్ పోరాటయోధురాలి పాత్రలో నటించనున్నది. కథానుగుణంగా సినిమాలో యుద్ధ సన్నివేశాలుంటాయని, ఈ పాత్ర కోసం సన్నీలియోన్ ప్రస్తుతం కత్తియుద్ధం, గుర్రపుస్వారీలలో శిక్షణ తీసుకుంటున్నట్లు చిత్రబృందం తెలిపింది. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సన్నీలియోన్ 150 రోజుల డేట్స్‌ను కేటాయించింది. ఈ సినిమాలో 70 నిమిషాలకు పైగా గ్రాఫిక్స్ వుంటాయట. బాహుబలి, “2.0 సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్‌ను సమకూర్చిన సాంకేతిక నిపుణులు పనిచేస్తారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నాం” అని నిర్మాత తెలిపారు. “ఈ సినిమా నాపై ఉన్న శృంగారతార అనే ఇమేజ్‌ను చెరిపివేస్తుంది. పోరాట నేపథ్యం వున్న చారిత్రక చిత్రంలో నటించాలనే నా కల ఈ సినిమాతో నెరవేరబోతుండటం ఆనందంగా ఉంది” అని సన్నీలియోన్ తెలిపింది. వచ్చే ఏడాది చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకొస్తామని, ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులను జరుగుతున్నాయని దర్శకుడు చెప్పారు.