స్క్రూటినీలోనే పోయారు!

తమిళనాడులోని ఆర్.కె నగర్ ఉపఎన్నికలో రోజుకో ట్విస్ట్ జరుగుతోంది. ఎవరూ ఊహించని విధంగా చివరి నిమిషంలో ఆర్.కె. నగర్‌ బరిలోకి దిగి సర్‌ప్రైజ్‌ చేసిన సినీనటుడు విశాల్ కు ఈసీ అంతే ఊహించని విధంగా షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాన్ని తిరస్కరించింది. నామినేషన్‌ పత్రాల్లో వివరాలు సరిగా లేకపోవటంతో పాటు తప్పులు ఉన్నాయని పేర్కొంది. ఐతే, ఈసీ నిర్ణయంతో షాకైన విశాల్ ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. దీంతో ఆయనను పోలీసుల అరెస్ట్ చేశారు. కుట్ర చేసి తన నామినేషన్‌ ను తిరస్కరించారని విశాల్ ఆరోపించారు. ఈ విషయాన్ని లీగల్ గా తేల్చుకుంటానని, కోర్టుకు వెళ్తానని విశాల్ తెలిపారు.

ఈ ఎన్నికలో గెలిచి అమ్మ వారసురాలిగా నిరూపించుకోవాలనుకుంటున్న జయలలిత మేనకోడలు దీపను కూడా ఈసీ నిర్ణయం పరేషాన్ చేసింది. నామినేషన్‌ పత్రాలు సరిగా లేవంటూ, ఆస్తి వివరాలు తెలుపలేదన్న కారణంతో ఆమె నామినేషన్‌ ను కూడా రిజెక్ట్ చేశారు. ఈసీ నిర్ణయాన్ని దీప తీవ్రంగా ఖండించారు. ఇదే ఏడాది ఏప్రిల్ లో తాను దాఖలు చేసిన నామినేషన్‌ ను ఆమోదించారని ఆమె గుర్తు చేశారు. తాను గెలుస్తానని భయపడి అడ్డుకునేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.

అటు విశాల్, దీప నామినేషన్లు రిజెక్ట్ చేయటంతో ఇక ఆర్‌.కె నగర్ ఉపఎన్నికలో ప్రధానంగా అన్నాడీఎంకే, డీఎంకే, శశికళ వర్గం మధ్యే పోటీ నెలకొంది. అన్నాడీఎంకే, శశికళ వర్గాలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. దివంగత జయలలిత నియోజకవర్గం కావటంతో ఇక్కడ గెలిచి అమ్మ వారసులమని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.