శరవేగంగా మెట్రో పెండింగ్ పనులు

హైదరాబాద్‌ మెట్రో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొదటి దశలో ప్రారంభం కాగా.. మిగతా పెండింగ్ ప్రాజెక్టును కూడా త్వరలో పూర్తి చేసి.. పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. 2018 డిసెంబర్ నాటికి 72 కిలోలోమీటర్ల మెట్రో మార్గాన్ని పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం పనులు జరుగుతున్నాయి.

మొత్తం మెట్రో పనులను ఆరు స్టేజ్‌లుగా విభజించింది ఎల్ అండ్ టీ మెట్రో. 2018 నాటికి కారిడార్-3 లో మిగిలిపోయిన స్టేజ్ -4 కు సంబంధించిన  అమీర్‌ పేట్ టూ హైటెక్ సిటీ, కారిడార్-1లోని స్టేజ్ -5 కి సంబంధించిన అమీర్ పేట్ టూ ఎల్బీనగర్ వరకు పనులు పూర్తి చేసి.. కారిడార్‌ -1, 3 లను స్థాయిలో కమర్షియల్ ఆపరేషన్స్‌కు సిద్ధం చేసేందుకు సమాయత్తం అవుతున్నది. కారిడార్-2 లోని 6 కిలోమీటర్ల మార్గం మినహా మొత్తం ప్రాజెక్టులోని 66 కిలోమీటర్ల మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. మూడు కారిడార్లకు సంబంధించి ఇప్పటికే 90 శాతం పనుల నిర్మాణాలను పూర్తి చేసినట్టు ఎల్ అండ్ టీ అధికారులు తెలిపారు. మియాపూర్‌-ఎల్బీనగర్ మార్గంలో స్టేజ్-2 పనులైన మియాపూర్-అమీర్‌ పేట్ ట్రాక్ పూర్తి చేయగా,.. మిగిలిపోయిన స్టేజ్-5 పనులైన అమీర్ పేట్-ఎల్బీనగర్ మార్గం పూర్తి చేయాల్సి ఉన్నది.

ఇక కారిడార్-3 ని మూడు స్టేజ్‌లుగా విభజించగా స్టేజ్-1 కు సంబంధించిన నాగోల్-మెట్టుగూడ.. స్టేజ్-3కి సంబంధించి మెట్టుగూడ-  అమీర్‌ పేట్ పనులు పూర్తయ్యి.. ఆపరేషన్స్‌ మొదలయ్యాయి. స్టేజ్‌- 4 పనులైన బేగంపేట-హైటెక్ సిటీ మార్గం పూర్తి చేయాల్సి ఉన్నది. ఈ రెండు కారిడార్లలో మిగతా పనులును జూన్ లోగా పూర్తిచేసి 57 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు వేగంగా సాగతున్నాయి. కారిడార్‌-2లో జేబీఎస్‌ నుంచి ఫలక్‌ నూమా వరకు మార్గం వేయాల్సి ఉంది. ఈ మార్గంలో స్టేజ్‌-6/1కు సంబంధించి.. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌ వరకు పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. ఎంజీబీఎస్‌ కు ఇంటర్ ఛేంజ్‌ పనులు కూడా పూర్తి చేశారు.

మరోవైపు హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు 1.5 కిలోమీటర్ల మేర పొడిగించిన మెట్రోరైలు మార్గాన్ని రెండేండ్లలో అందుబాటులోకి తెస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కారిడార్-3కి సంబంధించి రాయదుర్గం మెట్రో స్టేషన్ పనులను వచ్చే వారంలో ప్రారంభించాలని అధికారులకు సూచించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నాగోల్-హైటెక్‌సిటీ మార్గంలోని పెండింగ్ పనులను 2018 జూన్‌లోగా పూర్తిచేసి ఆపరేషన్స్‌కు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

ఇప్పటికే ప్రారంభమైన మెట్రోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడంతో… 72 కిలోమీటర్ల ప్రాజెక్టును 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది.