విశాల్‌కు షాక్‌ మీద షాక్!

ఆర్కే నగర్ ఉప ఎన్నికపై అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన విశాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. విశాల్ తో పాటూ జయలలిత మేనకోడలు దీప జయకుమార్ నామినేషన్ ను కూడా ఎన్నికల సంఘం తిరస్కరించింది.  అయితే తన నామినేషన్‌ తిరస్కరణకు గురైందన్న వార్తలతో.. విశాల్ ఆందోళనకు దిగారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో ఆయన నామినేషనన్ మళ్లీ ఆమోదించినట్లు వార్తలొచ్చాయి. సత్యం గెలిచింది, ఎన్నికల అధికారి నా నామినేషన్ ను ఆమోదించారంటూ విశాల్ ట్వీట్ చేశారు. కానీ చివరకు రాత్రి 11.30 గంటల సమయంలో విశాల్‌ నామినేషన్‌ను కూడా తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు. నామినేషన్ పత్రాల్లో ఇద్దరు స్థానికుల సంతకాలను ఫోర్జరీ చేయడంతో విశాల్ నామినేషన్ తిరసరిస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. అయితే నామినేషన్ తిరస్కరణపై అప్పీల్‌ కు వెళ్లాలని విశాల్ తండ్రి భావిస్తున్నారు.

నామినేషన్ తిరస్కరించినట్టు తెలిపిన తర్వాత డిసెంబర్ 5, 2016న అమ్మ (జయలలిత) చనిపోయింది. డిసెంబర్ 5, 2017న ప్రజాస్వామ్యం చనిపోయింది అంటూ విశాల్ తీవ్రస్థాయిలో రాత్రి ట్వీట్ చేశారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడి తమిళనాడులోని ఆర్కే నగర్ లో ఏం జరుగుతోందో గమనిస్తూనే ఉంటారు. న్యాయాన్ని పునరుద్ధరించండి అంటూ ఇవాళ మధ్యాహ్నం ట్వీట్ చేశారు.