వర్ధమాన రచయితలకు మార్గదర్శకుడు సుంకిరెడ్డి

సుంకిరెడ్డి నారాయణ రెడ్డి.. స్వస్థలం నల్లగొండ జిల్లా కనగల్ మండలం పగిడిమర్రి గ్రామం. అందరిలా కాకుండా సాహిత్య సేవ చేస్తూ సాహితీ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిస్తూ గొప్పకవిగా పేరు సంపాదించుకున్నాడు. మరుగునపడ్డ తెలంగాణ సాహిత్యాన్ని, చరిత్రను వెలికి తీసి పుస్తకాలు రాసి భావితరాలకు అందించిన గొప్ప గ్రంథకర్త. తెలంగాణకు సాహిత్య చరిత్ర లేదన్న సమైఖ్య పాలకుల వెకిలిమాటలకు చెంపపెట్టులా.. పరిశోధన చేసి తెలంగాణ ప్రాచీన సాహిత్యాన్ని ముంగిలి పేరుతో గ్రంథస్తం చేశారు. దీంతో పాటు తెలంగాణకు సదీర్ఘమైన చరిత్ర ఉందంటూ పరిశోధన చేసి రాసిన మరోక పుస్తకం తెలంగాణ చరిత్ర. ఈ గ్రంథం విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది. 2012లో నాటి ఉద్యమ నేత నేటి సీఎం.. కేసీఆర్‌ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నేటికి ఈ పుస్తకానికి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. విశ్వవిద్యాలయాల్లో ఈ పుస్తకాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. తెలంగాణ చరిత్ర ఎంత మహోజ్వాలంగా వెలిగిందో భవిష్యత్తు తరాలకు ఈ పుస్తకం చాటి చెప్తున్నది. చరిత్రలో తెలంగాణ ప్రజలు ఎంత గొప్పగా బతికారో ఎంత గొప్పగా  నాగరికత భాసిల్లిందో ఈ పుస్తకంలో వివరించారు. తెలంగాణ చరిత్ర పుస్తకంపై పరిశోధనలు కూడా జరిగాయి.

తెలంగాణ చరిత్ర పుస్తకానికి ముందు సుంకిరెడ్డి నారాయణరెడ్డి అనేక పుస్తకాలు రచించారు. తోవ ఎక్కడ, దాలీ, మత్తడి, గనుమ, అరుణతార, తెలంగాణ ఉద్యమ కవిత్వం, విపశ్యన కవిత్వం, నల్లవలస లాంటి పుస్తకాలు నారాయణరెడ్డి కలం నుంచి జాలువారినవే. ఒకవైపు రచయితగా మరోవైపు చరిత్రకారుడిగా చేస్తూనే.. నీలగిరి సాహితీ సంస్థను స్థాపించి మరుగున పడ్డ మాణాక్యాల్లాంటి ఎన్నో కావ్యాలను, గ్రంథాలను ప్రచురణ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మరుగున పడ్డ 25 గ్రంథాలను వెలికితీసి ప్రచురించే ప్రక్రియను వేగవంతం చేశారు.

ఇలా భవిష్యత్‌ తరాలకు సాహిత్య విలువలను అందించేందుకు నారాయణరెడ్డి విశేషమైన కృషి చేస్తున్నారు. సాహితీరంగానికి ఆయన చేస్తున్న సేవలకుగానూ ఎన్నో సత్కారాలు వరించాయి. నారాయణరెడ్డికి తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను కూడా ప్రధానం చేసింది. మరుగునపడ్డ చరిత్రను వెలికితీసి రచనలు చేస్తున్న సుంకిరెడ్డి  వర్ధమాన రయితలకు మార్గదర్శకుడిగా నిలిచాడు. లెక్చరర్ గా రిటైర్డ్ అయిన ఆయన విద్యార్థులకు రచనలపై మక్కువ కల్గేలా ప్రోత్సహిస్తున్నారు. కాలేజీల్లో రచనా పోటీలు నిర్వహించి.. బహుమతులను కూడా ప్రదానం చేస్తున్నారు.