లిజీ మళ్లీ వస్తోంది!

సాక్షి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ నటి లిజీ దాదాపు 25 ఏళ్ల విరామం తరువాత మళ్లీ తెలుగు సినిమాతో కెమెరా ముందుకొస్తున్నారు. పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఎన్.సుధాకర్‌రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని కీలక పాత్రలో లిజీ నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. “పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్, ఎన్.సుధాకర్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ద్వారా 25 ఏళ్ల తరువాత మళ్లీ సినిమాల్లోకి ప్రవేశిస్తున్నాను. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాను. ఈ సినిమా న్యూయార్క్‌లో జరిగిన షెడ్యూల్‌లో తొలిసారి కెమెరా ముందుకొచ్చాను. భయంగా అనిపించినా థ్రిల్లింగ్ వుంది. తెలుగులో దాదాపు 8చిత్రాలు చేశాను. అందులో ఆరు సూపర్‌హిట్‌లే. వాటిలో మగాడు, 20వ శతాబ్దం చిత్రాలు మలయాళంలో మూన్నమ్ మూర, ఇరుప్పాతం నూట్టండు పేర్లతో రీమేక్ అయ్యాయి. త్వరలో మలయాళంలో ఓ సినిమాతో పాటు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా చేయబోతున్నాను. 22 ఏళ్ల వయసులో వరుస అవకాశాల్ని కాదని సినిమాలకు దూరమయ్యాను. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి పాత్రలు చేయాలని ఆశిస్తున్నాను” అని తెలిపింది.