లండన్ కోర్టుకు హాజరైన మాల్యా

భారత్‌ లో బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్‌ పారిపోయిన విజయ్‌ మాల్యా… తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలన్నారు. కావాలనే తనపై కుట్ర చేసి ఇరికించారని ఆరోపించారు. విజయ్‌ మాల్యాను భారత్‌ కు అప్పగించే కేసుకు సంబంధించి లండన్‌ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణకు హాజరైన విజయ్‌ మాల్యా తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని కోర్టుకు నిరూపిస్తానని చెప్పారు. రుణాల ఎగవేతకు సంబంధించి న్యాయపరంగా పోరాడతానన్నారు.

ఐతే, మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం విజయ్‌ మాల్యా సరైన సమాధానాలు చెప్పలేదు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారి అస్తానా భారత తరఫున హాజరయ్యారు. మాల్యాపై భారత్‌ లో ఉన్న అభియోగాలను నిరూపించి ఆయనను స్వదేశానికి రప్పించేందుకు సీబీఐ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.