లంకపై సిరీస్ గెలుపు, కోహ్లి సేన రికార్డ్

భారత్‌-శ్రీలంక చివరి టెస్టు డ్రాగా ముగిసింది. కోహ్లీ సేన మార్చి మార్చి బౌలర్లను ప్రయోగించినా ఫలితం దక్కలేదు. లంకేయుల అసాధారణ పోరాటం ముందు టీమిండియా ప్రణాళికలు పారలేదు. ఐదో రోజు, బుధవారం ఓవర్‌ నైట్‌ స్కోరు 31/3 తో బ్యాటింగ్‌ కు దిగిన శ్రీలంక జట్టు నిలకడగా రాణించింది. శ్రీలంక ఆలౌట్‌ కాకుండా ధనంజయ డిసిల్వా, కొత్తకుర్రాడు రోషన్‌ సిల్వా అడ్డుగా నిలిచారు. దీంతో శ్రీలంక 103 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది. ఆట ముగిసేందుకు మరో 7 ఓవర్లు ఉండగా రెండు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో చివరి టెస్టు డ్రా గా ముగిసింది. మూడు టెస్టుల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న భారత్‌కు ఇది వరుసగా తొమ్మిదో సిరీస్‌ విజయం. దీంతో గతంలో ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ సరసన కోహ్లీసేన నిలిచింది.

బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించే చివరి రోజు ఇండియన్ పిచ్‌పై మన స్పిన్నర్లకు శ్రీలంక చెక్ పెట్టి మూడో టెస్ట్‌ను డ్రా చేసుకుంది. ధనంజయ డిసిల్వా (119) సెంచరీ, రోషన్ సిల్వా (74 నాటౌట్), డిక్‌వెలా (44 నాటౌట్) అద్భుత పోరాటంతో లంక ఓటమి నుంచి తప్పించుకుంది. సిరీస్‌ను ఇండియా 1-0తో గెలిచింది కానీ.. విజయం ఖాయమనుకున్న మ్యాచ్‌లో డ్రా ఎదురు కావడమే కోహ్లికి మింగుడు పడనిది. ఏదైతేనేం ఊహించినంత ఘనంగా కాకపోయినా.. మొత్తానికి ఇండియా వరుసగా 9వ టెస్ట్ సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. గతంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేసింది.

మ్యాచ్‌లో మ‌రింత స‌మ‌యం మిగిలి ఉన్నా.. ఫ‌లితం వ‌చ్చేలా లేద‌ని ముందే రెండు జ‌ట్ల కెప్టెన్లు డ్రాకు అంగీక‌రించారు. మ్యాచ్ డ్రాగా ముగిసే స‌మ‌యానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల‌కు 299 ప‌రుగులు చేయ‌డం విశేషం. ఓ విదేశీ టీమ్ భార‌త గ‌డ్డ‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో చేసిన అత్య‌ధిక ప‌రుగులు ఇవే.

410 పరుగుల లక్ష్యం ముందుండగా.. నాలుగో రోజు ముగిసేసరికి 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది లంక. ఈ లెక్కన చివరి రోజు తొలి సెషన్‌లోనే లంక పనైపోతుందని అంతా భావించారు. అందుకు తగినట్లే ఆరో ఓవర్లోనే డేంజర్ బ్యాట్స్‌మన్ మాథ్యూస్ (1)ను జడేజా వెనక్కి పంపాడు. అయితే అసలు కథ అప్పుడే మొదలైంది. ధనంజయ డిసిల్వాతో కలిసిన కెప్టెన్ చండీమాల్ (36) తొలి సెషన్‌లో మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు ఏకంగా 112 పరుగులు జోడించారు. లంచ్ తర్వాత మొత్తానికి చండీమాల్‌ను అశ్విన్ ఔట్ చేసినా.. ఇక ఆ తర్వాత మరో వికెట్ దక్కలేదు. ఉన్న నలుగురు బౌలర్లను కోహ్లి మార్చి మార్చి వేయించినా.. ఫలితం లేకపోయింది. తొలి టెస్ట్ ఆడుతున్న రోషన్ సిల్వా, వికెట్ కీపర్ డిక్‌వెలా అద్భుతంగా పోరాడారు. సెంచరీ చేసిన డిసిల్వా గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

లంక కెప్టెన్ చండీమాల్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్‌గా, ఇండియ‌న్ కెప్టెన్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు. ఇక ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ మ‌ళ్లీ చండీమాల్‌కే ద‌క్క‌గా.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా కోహ్లి(610) నిల‌వ‌డం విశేషం.