రైతుల ఖాతాల్లోకే ఎరువుల సబ్సిడీ

కేంద్రం అందిస్తున్న ఎరువుల సబ్సిడీ ఇకనుంచి నేరుగా రైతుల ఖాతాకే చేరనుంది. ఎరువుల సబ్సిడీ పక్కదారి పట్టకుండా కేంద్రం అమలుచేస్తున్న రాయితీ బదిలీ విధానం జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఎరువుల సబ్సిడీకి కేంద్రం ఏటా దాదాపు రూ.75 వేల కోట్లు వెచ్చిస్తున్నది. అయితే ఇది రైతులకు చేరకుండా పక్కదారి పడుతున్నదని గుర్తించిన కేంద్రం డీబీటీ విధానాన్ని అమలు చేయాలని భావించింది. దేశంలోని 14 జిల్లాల్లో రెండేళ్లుగా ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తున్నది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోనూ ఈ విధానం అమలవుతున్నది. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి వ్యవసాయ శాఖ అంతా సిద్ధం చేసింది. వాస్తవానికి డీబీటీ విధానం డిసెంబర్ 1 నుంచే రాష్ట్రంలో అమలు చేయాల్సి ఉంది.

అయితే ఎరువుల విక్రయాలను ఆధార్‌తో అనుసంధానించే పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు అన్నిచోట్లా అందుబాటులోకి రాకపోవడంతో ప్రారంభం కా లేదు. జనవరి 1 నుంచి రాష్ట్రంలోని ఎరువుల విక్రయకేంద్రాలు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోకి వచ్చేలా చూడాలని కేంద్రం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో పీవోఎస్ మిషన్ల ద్వారానే ఎరువుల విక్రయాలు జరపాలని, లేకుంటే లైసెన్సులను రద్దు చేయాలని వ్యవసాయశాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. డీబీటీ విధానం అమలు కావాలంటే ప్రతి రిటైల్ ఎరువుల దుకాణం విక్రయదారుడి వద్ద పీవోఎస్ యంత్రం ఉండాలి. రాష్ట్రంలో 6,027 పీవోఎస్ మిషన్లు అవసరం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే నాగార్జున ఫర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ రాష్ట్రంలో 5,605 పీవోఎస్ మిషన్లు పంపిణీ చేసింది. వీటిల్లో 3,537 మిషన్లను యాక్టివేట్‌లోకి తీసుకువచ్చారు. మిషన్లలో ప్రారంభ స్టాక్ వివరాలను నమోదుచేస్తేనే పీవోఎస్‌లతో విక్రయాలు అమలు కానున్నాయి. మిషన్ల వినియోగంపై ఎరువుల దుకాణాదారులకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించారు.

మరోవైపు ఎరువులు కొనుగోలు చేయాలకునే రైతు పట్టాదార్‌ పాసు పుస్తకంతో పాటు, ఆధార్ సంఖ్య, కిసాన్‌క్రెడిట్‌కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒక గుర్తింపుకార్డు తీసుకునిరావాలి. అలాగే బ్యాంకు అకౌంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పట్టాదారుడి వేలిముద్రనూ తీసుకుంటారు. రైతుకున్న భూమి విస్తీర్ణం ఆధారంగా అమ్మిన ఎరువుల వివరాలను, రైతు చెల్లించిన మొత్తాన్ని దుకాణదారుడు పీవోఎస్‌లో నమోదు చేస్తాడు. ఈ సమాచారం మొత్తం కేంద్రప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సెంట్రల్ సర్వర్‌లో నిక్షిప్తం అవుతుంది. తీసుకున్న ఎరువులకు సంబంధించి కేంద్రం అందించిన సబ్సిడీ నేరుగా రైతులకు ఖాతాలోకి వస్తుంది. దీంతో రైతులు కానివారు ఎవరైనా ఎరువులు కొంటే వెంటనే తెలిసిపోతుంది. తద్వారా సబ్సిడీ దుర్వినియోగం కాదని కేంద్రం భావిస్తున్నది.