రామగుండం చేరుకున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లా రామగుండం చేరుకున్నారు. ఎన్టీపీసీ అతిథి గృహంలో ఈ రాత్రికి బస చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పరిశీలనలో భాగంగా ఇవాళ సాయంత్రం చివరిగా గోలివాడ పంపుహౌజ్ ను ముఖ్యమంత్రి సందర్శించారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా రామగుండం వెళ్లారు.

ఉదయం కరీంనగర్ తీగలగుట్టపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం కేసీఆర్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తుపాకులగూడెం చేరుకున్నారు. అక్కడ గోదావరిపై బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి, పనులు పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ ను సీఎం కేసీఆర్‌ తిలకించారు.  మేడిగడ్డ నుంచి కన్నెపల్లికి వెళ్లి పంపు హౌస్‌ ను సందర్శించారు. ఆ తర్వాత అన్నారం బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడి నుంచి సిరిపురం చేరుకున్న సీఎం కేసీఆర్.. మంత్రులు, అధికారులతో కలిసి భోజనం చేశారు.

భోజన విరామం తరువాత సుందిళ్ల బ్యారేజ్‌ కు చేరుకున్నారు. బ్యారేజ్‌ మ్యాప్‌ లను పరిశీలించి.. పనులు జరుగుతున్న తీరుని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి గోలివాడ వెళ్లి పంపుహౌస్‌ నిర్మాణ పనులను వ్యూ పాయింట్ నుంచి పరిశీలించారు.