మెట్రో స్మార్ట్ కార్డుపై మరింత రాయితీ

మెట్రో రైల్‌ ప్రయాణికులకు మరింత చేరువ కావడానికి ఎల్‌ అండ్‌ టి మరిన్ని రాయితీలను ప్రకటించింది. మెట్రో స్మార్ట్‌ కార్డు కొనుగోలు చేసేవారికి.. ప్రయాణ చార్జీల్లో పది శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. మొదట్లో కార్డు పై 5 శాతం రాయితీ ఉండగా.. ఇప్పుడు పది శాతానికి పెంచారు. ఈ రాయితీ వచ్చే యేడాది మార్చి 31 వరకు అన్ని ట్రిప్పుల్లో వర్తిస్తుందని ప్రకటించింది. ఇక పేటీఎం ద్వారా మొదటిసారిగా రూ. 100.. అంతకంటే ఎక్కువ రీఛార్జ్‌ చేసుకుంటే రూ.20 నగదును తిరిగి చెల్లించే క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. 

మెట్రో స్టేషన్లలో ఉన్న టికెటింగ్‌ కార్యాలయాల నుంచి స్మార్ట్‌ కార్డులు కొనుగోలు చేయడంతో పాటుగా, ప్రతి మెట్రో స్టేషన్‌ లో రీచార్జ్‌ చేసుకునే వీలు కల్పించారు. టీ సవారి యాప్‌, పేటీఎం, హెచ్‌ఎంఆర్‌ ప్యాసింజర్‌ వెబ్‌ సైట్‌, స్టేషన్‌ కాంకోర్స్‌ ఏరియాపై ఉన్న పెయిడ్‌ ఏరియాలోని యాడ్‌ వాల్యూ మిషన్‌ ఉపయోగించి స్మార్ట్‌ కార్డులను రీచార్జ్‌ చేసుకునే వీలుంటుంది.

ఇక, మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని అధికారులు చెప్పారు. ప్రభుత్వం సూచించిన పార్కింగ్‌ ప్రదేశాలతో పాటు ఎల్‌ అండ్‌ టి ఎంఆర్‌హెచ్‌ఎల్ నాగోల్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌, రసూల్‌ పురా, బాలానగర్‌, కూకట్‌ పల్లి, మియాపూర్‌ వద్ద ప్రయాణికుల సౌకర్యార్ధం పార్కింగ్‌ సదుపాయం కల్పించింది.

అంచనాలకు అనుగుణంగానే.. మెట్రో రైల్‌ రాకతో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌  తగ్గుముఖం పట్టింది. మెట్రో ట్రైన్‌ ప్రారంభమైన తర్వాత.. ఆ రూట్‌లో ట్రాఫిక్‌  తగ్గినట్టు  హెచ్‌ఆర్‌ఎంఎల్‌ ప్రకటించింది. రోజుకి లక్ష నుంచి లక్షా యాభై వేల మంది మెట్రోలో  ప్రయాణిస్తుండటంతో.. రోడ్లపై పడుతున్న భారం తగ్గుముఖం పడుతున్నది. అటు రైల్వే స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన స్టీల్‌ రెయిలింగ్‌ సత్ఫలితాలిస్తోంది. మెట్రో ప్రయాణికులు కిందికి దిగి ప్రధాన రోడ్లపైకి చేరుకునేందుకు.. ఈ రెయిలింగ్‌ కాపాడుతున్నది.