‘మీ’ సేవ అమోఘం

డిజిటల్ లావాదేవీల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. మీ-సేవ ఆపరేటర్లు ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ, లంచాల బారి నుండి కాపాడుతూ, అందుబాటులో ఉంటున్నారని ప్రశంసించారు. 10 కోట్ల లావాదేవీలు పూర్తి చేయడం గొప్ప విషయమని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర మీ-సేవ 10 కోట్ల లావాదేవీలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో మీ-సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు అందుబాటులోకి రావాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుంటారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. భూ రికార్డుల ప్రక్షాళనలో 100 శాతంతో రాజన్న సిరిసిల్ల మొదటి స్థానం లో నిలిచిందన్నారు. ల్యాండ్ రికార్డ్ విషయంలో లంచాలను పూర్తిగా నివారించేందుకే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సీఎం కేసీఆర్ చేపట్టారని వివరించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షిత మంచినీరు ఇస్తామని, ఇవ్వకుంటే ఓట్లు అడగం అన్న దమ్మున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లే కాదు ఫైబర్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ కూడా అందిస్తున్నామని వెల్లడించారు.

గ్రామాల్లో పని చేయడానికి వైద్యులు, ఉపాధ్యాయులు ఇష్టపడటం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే, టి ఫైబర్ ద్వారా రానున్న రోజుల్లో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలంటే మనకు తెలియాలని, అందుకే డిజిటల్ లిటరసీ అందిపుచ్చుకోవాలని సూచించారు. మీ-సేవ ఆపరేటర్లు అందరూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో భాగస్వాములైతే కోటి మందిని డిజిటల్ అక్షరాస్యుల్ని చేసే అవకాశం ఉందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. వాహనాల పేపర్స్ ను రెగ్యులర్ గా పాకెట్ లో పెట్టుకోవడం కష్టం కాబట్టి ఎం-వ్యాలెట్ రూపొందించామని గుర్తుచేశారు. దీనితో వాహనం పేపర్స్ అన్నీ ఒకేచోట ఉంటాయన్నారు. డిజిటల్ లావాదేవీలు నిర్వహించడానికి టి-వ్యాలెట్ రూపొందించామని తెలిపారు.

టి ఫైబర్ ద్వారా మీ-సేవ కేంద్రాలకు బ్రాడ్ బ్యాండ్ ఫ్రీగా ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో మూతపడిన 150 మీ-సేవ సెంటర్లను తెరిపించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. మీ-సేవ ఆపరేటర్లకు ఉన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు.