మీ నివేదికే ఆదేశంగా అమలు చేస్తాం!

చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం కోసం పార్లమెంటులో చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రం తరఫున కోరనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీసీల సంక్షేమం, అభివృద్ధిపై భోజన విరామం తర్వాత అసెంబ్లీ కమిటీ హాలులో కొనసాగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం డిమాండ్ గా కేంద్రం ముందు పెడతామని చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర అఖిలపక్ష కమిటీ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి వత్తిడి తెస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని, పదోన్నతుల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు.

బీసీల డిమాండ్లపైనా, బీసీల అభ్యున్నతి కోసం తీసుకునే చర్యలపై త్వరలోనే అసెంబ్లీలో ఒక రోజు పూర్తి స్థాయి చర్చ చేపట్టాలని ముఖ్యమంత్రి అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. బీసీ ప్రజాప్రతినిధులంతా రెండు, మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించుకుని, తమకు ఏం కావాలో నిర్ణయించుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చించి అవసరమైన తీర్మానాలు, చట్టాలు, జీవోలు తేవాలని సీఎం నిర్ణయించారు.

బీసీల సమస్యలపై సమావేశం నిర్వహించినందుకు ఎమ్మెల్యేలు కె. లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీల అభ్యున్నతి కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పడిన మంచి అవకాశంగా ఈ సమావేశాన్ని వారు అభివర్ణించారు. వీరిద్దరితోపాటు సమావేశంలో పాల్గొన్న మరికొంత మంది ప్రజాప్రతినిధులు కూడా పలు సూచనలు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారు.

‘‘బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని అంశాలపై సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసుకుందాం. బీసీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి టి.ఎస్.ఐ.ఐ.సి. ఇచ్చే భూముల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం. ఇంకా బీసీలకు ఏమి చేయాలో కొత్త పథకాలు రచించండి. అన్ని కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించండి. అందరి అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి. మీరు ఇచ్చిన నివేదికనే ఆదేశంగా స్వీకరించి ప్రభుత్వం అమలు చేస్తుంది. మీరు చర్చించిన అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా ఒకరోజు చర్చ పెడతాం. అసెంబ్లీలోనే విధానపరమైన నిర్ణయాలు ప్రకటిద్దాం. బీసీల విషయంలో రాజకీయాలు లేవు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఒకే విధంగా కోరుకుంటున్నారు. ఉన్నంతలో బీసీల కోసం ఎంత ఉన్నతంగా పనిచేయగలమన్నదే ఇక్కడ ప్రధానాంశం. కేవలం ప్రభుత్వమే ఖ్యాతి పొందాలనుకోవడం లేదు. అన్ని పార్టీలు కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలని ప్రజలకు చెబుదాం. దీంతో ప్రజలకు కూడా మంచి సందేశం పోతుంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘కొన్ని కులాలకు సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో ఇబ్బందులున్నాయి. ప్రభుత్వ లబ్ది అందుకునే విషయంలో కొన్ని కులాల మధ్య ఘర్షణలున్నాయి. కొన్ని కులాల గుర్తింపుకు సంబంధించిన సమస్యలున్నాయి. హాస్టళ్లలో పిల్లలు చేరకుండా రెసిడెన్షియల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి అన్ని విషయాల్లో ఆచరణీయమైన మార్గాన్ని ప్రజాప్రతినిధులు సూచించాలి’’ అని సీఎం కేసీఆర్ కోరారు.