మిషన్ భగీరథపై రవిశంకర్ ప్రశంసలు

చెరువుల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యకమంపై ప్రశంసలు కురిపించారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ రవిశంకర్. 45 వేల చెరువులను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. నదుల పునరుజ్జీవనంపై బెంగళూరులో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. నీటి కొరత కారణంగా రాష్ట్రాల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్య, ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ తో పాటూ పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.