మిషన్ కాకతీయలో తొలిసారి..!

మిషన్‌ కాకతీయ 4వ దశలో 34 కొత్త చెరువుల నిర్మాణాన్ని చేపడుతున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 కొత్త చెరువుల తవ్వకానికి స్టేజ్-1  కింద రూ.13 కోట్లకు పరిపాలన పరమైన ఆమోదం లభించినట్టు ఆయన తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో 26 కొత్త చెరువులు తవ్వాలని ఇదివరకే నిర్ణయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వాటికి సంబంధించి స్టేజ్‌–1 అనుమతిని మంజూరు చేస్తూ రూ.92 కోట్ల నిధులను మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. భూసేకరణ తదితర చట్టపరమైన పనులను పూర్తి చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నామని మంత్రి వివరించారు. భూసేకరణ తదితర పనులు పూర్తయ్యాక ఆయా చెరువుల నిర్మాణానికి సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలను పంపాలని చిన్న నీటి పారుదల చీఫ్‌ ఇంజనీర్‌ను ఆదేశించినట్టు హరీశ్ రావు చెప్పారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో కంగ్టి మండలం సుకల్ తీర్థ్ గ్రామంలో కాకివాగు కొత్త చెరువును నిర్మించనున్నారు. ఇందుకు 1 కోటి 47 లక్షల 56వేల రూపాయలను స్టేజ్-1 కింద మంజూరు చేశారు. ఈ చెరువు నిర్మాణానికి 144 ఎకరాల భూమిని సేకరించనున్నారు. మనూర్ మండలం ఇర్కపల్లి ఈస్ట్ గ్రామంలో చెరువుకు 2 కోట్ల 11 లక్షల 99 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఇందుకు గాను 210 ఎకరాల భూసేకరణ చేయవలసి ఉన్నది. ఇర్కపల్లి గ్రామంలోనూ 97 లక్షల 95 వేలతో కొత్త చెరువును నిర్మించనున్నారు. ఇందుకు 96 ఎకరాలను సేకరించనున్నారు. అదే మండలం కేశ్వర్ గ్రామంలో కోటి 2 లక్షల 23 వేల రూపాయలతో కొత్త చెరువు నిర్మాణం జరగనుంది. ఇందుకు 100 ఎకరాల భూకరణ జరగాలి. ఊటపల్లి గ్రామంలో 2 కోట్ల 87 లక్షల 20 వేలతో తలపెట్టిన కొత్త చెఱువు నిర్మాణానికి గాను 285 ఎకరాల భూసేకరణ చేయాలి. ఎస్గి గ్రామంలో 73 లక్షల 8 వేల వ్యయంతో తలపెట్టిన కొత్త చెరువు నిర్మాణానికి 72 ఎకరాలను సేకరించాలి.

మనూర్ మండలంలోనే మొర్గి గ్రామంలోని కొత్త చెరువు ఆధునీకరణ పనుల కోసం ప్రభుత్వం 3 కోట్ల 61 లక్షల 37 వెలను మంజూరు చేసినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇందుకు గాను 360 ఎకరాల భూసేకరణ చేయాలి. నారాయణఖేడ్ మండలం జగన్నాధపూర్ గ్రామంలో 1 8 లక్షల 73 వేల వ్యయంతో కొత్త చెరువును నిర్మించనున్నారు.

ఈ కొత్త చెరువుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులకు, మూడు జిల్లాల కలెక్టర్లకు, ఇంజనీర్లకు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. మిషన్‌ కాకతీయలో కొత్త చెరువుల నిర్మాణానికి అనుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి.