మాల్యా ముమ్మాటికీ దోషే!

విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా భారత్ వద్ద ఎలాంటి సాక్ష్యాధారాలు లేవంటూ ఆయన తరఫు న్యాయవాదులు వాదిస్తున్న నేపథ్యంలో మాల్యా దోషేనన్న బలమైన సాక్ష్యాధారాలు తమ దగ్గర ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న కేసుపై లండన్ వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టులో విచారణ జరుగుతున్నది. 17 బ్యాంకులకు రూ.9,000 కోట్లు బకాయిపడిన మాల్యా.. వాటిని ఎగ్గొట్టి గతేడాది మార్చిలో లండన్ పారిపోయినదీ విదితమే. చెక్ బౌన్సులు, రుణాల ఎగవేత కేసుల్లో స్థానిక కోర్టుల నుంచి సుప్రీం కోర్టుదాకా నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లూ మాల్యాపై జారీ అయ్యాయి. మరోవైపు వరుస కోర్టు విచారణలకు మాల్యా క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. గురువారం విచారణలో భారతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి మాల్యా వినియోగించిన డాక్యుమెంట్ల పరిశీలనకు బ్యాంకింగ్ నిపుణుడిని కోర్టుకు తీసుకువచ్చారు. ఈ నెల 14 వరకు రోజువారీ విచారణ కొనసాగనుండగా, ఈ కేసులో భారత్ తరఫున సీపీఎస్ బారిష్టర్ మార్క్ సమ్మర్స్ వాదనలు వినిపిస్తున్నారు.