మాల్యా మంచోడెలా అయ్యాడు?

ఒకప్పుడు కింగ్‌ ఫిషర్‌ అధినేతగా.. విలాసాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా.. విజయవంతమైన వ్యాపారవేత్తగా అందరి చేత శెభాష్‌ అనిపించుకున్నాడు విజయ్‌ మాల్యా. కానీ ఇప్పుడు ఆ లిక్కర్‌ కింగ్‌ కాస్తా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన దొంగ. ప్రజల సొమ్మును దోచుకుని లండన్‌లో దర్జాగా బతుకుతున్న మాల్యాను భారత్‌ రప్పించేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా విదేశీ చట్టాలను ఆసరాగా చేసుకుని దర్జాగా బతికేస్తున్న మాల్యా భారత్‌కు నిందితుడు కాగా… లండన్‌లోని టెవిన్‌ గ్రామ ప్రజలకు మాత్రం ఆయన హీరో. ఆ గ్రామానికి ఆయన విలువైన ఆస్తి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆయనో గొప్ప వ్యక్తి అనేది టెవిన్‌ ప్రజల నమ్మకం.

లండన్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది టెవిన్‌. భారత్‌ నుంచి పారిపోయిన మాల్యా ప్రస్తుతం అక్కడే తలదాచుకుంటున్నాడు. ప్రస్తుతం టెవిన్‌లో ఉంటున్న 2వేల మంది ప్రజలు మాల్యాకు మద్దతుగా నిలుస్తున్నారు. జనం ఆయనను అంతగా వెనకేసుకురావడానికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ ఊరి కోసం విజయ్‌ మాల్యా 13 లక్షల రూపాయలు వెచ్చించి క్రిస్మస్‌ ట్రీని బహూకరించాడట. అప్పడప్పుడూ గ్రామస్థులకు అవసరమైన ఆర్థిక సాయం కూడా చేస్తున్నారట. దీంతో ఆయనపై ఊరి జనానికి అభిమానం రెట్టింపైంది.  మాల్యా మా ఊరికి ఓ పెద్ద ఆస్తి అని స్థానికులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అంతేకాదు విజయ్‌ మాల్యాలాంటి మంచి మనిషి, గొప్ప మనసున్న వ్యక్తి తమ మధ్య ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు.

టెవిన్‌లో ఫాదర్‌ ఆఫ్‌ ఎఫ్‌ వన్‌ ఛాపింయన్‌ లూయిస్‌ హామిల్టన్‌కు చెందిన  బంగ్లాను కొనుగోలు చేశాడు విజయ్‌ మాల్యా. ఏటా అక్కడ క్లాసిక్‌ కార్‌ షో జరుగుతుంది. ఆ షోలో కలియ తిరుగుతూ కనిపించే మాల్యాను ఊరిలో ఎవరూ కూడా పల్లెత్తు మాట అనరు. మాల్యా ఏదో బాధల్లో ఉన్నారని స్థానికులందరికీ తెలుసని, ఎంత డబ్బున్నోడికైనా అలాంటి బాధలు తప్పవంటున్న గ్రామస్థులు త్వరలోనే ఆయన కష్టాలన్నీ తీరిపోవాలని కోరుకుంటున్నారు. కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను భారత్‌కు అప్పగించదనే నమ్మకంతో ఉన్నారు.

గతంలో కింగ్‌ ఆఫ్‌ గుడ్‌ టైమ్స్‌గా  పేరు తెచ్చుకున్న విజయ్‌ మాల్యా భారత్‌లో పలు బ్యాంకుల నుంచి దాదాపు 9వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని పత్తా లేకుండాపోయాడు. మాల్యా  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 16వందల 50 కోట్లు, పంజూబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు 8వందల కోట్లు, ఐడీబీఐకు 8వందలు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 650, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 550, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 430, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 410 కోట్లు ఎగనామం పెట్టగా.. యూకో బ్యాంకు 320, కార్పొరేషన్‌ బ్యాంక్‌కు 310 కోట్లు,  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌కు 150, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ 140, ఫెడరల్‌ బ్యాంక్‌కు 90 కోట్లు, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు 60 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌కు 50 కోట్లు, మరో 3 బ్యాంకింగ్‌ సంస్థలకు 603 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు. ఈ మొత్తానికి వడ్డీలు, పెనాల్టీలు కలిపితే మాల్యా కట్టాల్సిన మొత్తం 9వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని లెక్క తేలింది. మొత్తమ్మీద మందిని సొమ్ముతో మజా చేస్తున్న మాల్యాను భారత్‌కు రప్పించి ఈడీ, సీబీఐలు చాలానా కష్టపడుతున్నాయి. మరి బ్రిటన్‌  ఆయనను భారత్‌కు అప్పగిస్తుందా లేదా అన్నది ఇప్పటికి మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌.