మత్స్యకారుల పొట్ట కొడితే సహించేది లేదు

నిషేధిత అలవి వలలతో శ్రీశైల౦ తిరుగు జలాలలో చేపలు పట్టడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి కోసం కోట్ల రూపాయలు వెచ్చించి చేప పిల్లలు వదులుతుంటే, కొంత మంది మాఫియాగా ఏర్పడి వాటిని పట్టుకుపోవడంపై తీవ్రంగా స్పందించారు.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి వద్ద కృష్ణా నదిలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన జాలరులు నిషేధిత అలవి వలలతో చేపలు పట్టి అక్రమంగా తరలించుకుపోతున్నారు. సమాచారం అందుకున్న కొల్లాపూర్ పోలీసులు దాడులు చేశారు. రెండు అలవి వలలతో పాటు లక్షలాది చనిపోయిన చేపపిల్లలను స్వాధీనం చేసుకున్నారు.

కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన అలవి వలలు, చనిపోయిన చేపపిల్లలను మంత్రి కృష్ణారావు పరిశీలించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో మాట్లాడి చట్టంలో మార్పులు చేసైనా చర్యలు తీసుకుంటామన్నారు.

అంతకుముందు, జిల్లాలోని కోడేరు మండ‌లంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప‌ర్యటించారు. ప‌లు గ్రామాల్లో స్థానికుల‌తో మాట్లాడారు. తండాల‌ను పంచాయ‌తీలుగా చేయాల‌న్న స్థానికుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. మైలారం పంచాయ‌తీ ప‌రిధిలోని నార్య నాయక్ తండాను పంచాయతీగా చేయడంతో పాటు, ఎర్రన్నబండ తండా, వాడిత్య తండా, మూల మడత తండా, కర్రెన్న బండ తండాల‌ను క‌లిపి కొత్త పంచాయ‌తీగా చేయాల‌ని ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. ఠాకూర్‌ తండా, ఈర్ల కుంట తండా లను మ‌రో పంచాయతీగా చేయాల‌ని స్థానికులు మంత్రి జూపల్లిని కోరారు.