బ్యారేజీల నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలన మధ్యాహ్నం కూడా కొనసాగింది. భోజనం తర్వాత సుందిళ్ల బ్యారేజీని, సిరిపురం వద్ద నిర్మిస్తున్న పంప్ హౌజ్ ను, గోలివాడ పంప్ హౌజ్ ను సందర్శించారు. అక్కడ నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులు, ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు.

బ్యారేజీల నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారు. గత ఏడాది భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలకు మిడ్ మానేరు డ్యాం వద్ద మట్టి కట్ట కొట్టుకుపోయిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఆ చేదు అనుభవాన్ని గుణపాఠంగా స్వీకరించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులను పటిష్టం చేయాలని చెప్పారు.  ప్రధాన బ్యారేజీకి కరకట్టలు కలిసే చోటును అత్యంత పటిష్టంగా నిర్మించాలన్నారు.

బ్యారేజీ నిర్మాణంతో పాటు గోదావరికి రెండు వైపులా రవాణ సౌకర్యం కల్పించేందుకు  వీలుగా డబుల్ లేన్ రోడ్డు వేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది వర్షాలు వచ్చే లోపు పంప్ హజ్ ల నిర్మాణం పూర్తి  కావాలని చెప్పారు.   ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను కూడా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.

గోదావరి ప్రవాహ ఉధృతికి అనుగుణంగా నిర్మాణాలు
1.63 కిలోమీటర్ల పొడవుతో 16.17 టిఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ ఎంత వరద వచ్చినా తట్టుకునేలా ఉండాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న పనులన్నింటినీ ముఖ్యమంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. కన్నెపల్లిలో నిర్మిస్తున్న మేడిగడ్డ పంప్ హజ్ ను, లిప్టు సిస్టంను సీఎం పరిశీలించారు. 11 మోటార్లను బిగించి నీటిని ఎత్తిపోసే వ్యవస్థ గురించి అధికారులు వివరించారు. పంప్ హజ్ పనులు ఎండాకాలంలోనే పూర్తయ్యేలా చూడాలని సీఎం చెప్పారు.

అనంతరం 1.27 కిలోమీటర్ల మేర 10.87 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న అన్నారం బ్యారేజీని సీఎం కేసీఆర్ సందర్శించారు. ఆ తర్వాత సిరిపురంలో నిర్మిస్తున్న అన్నారం పంప్ హౌజ్ ను పరిశీలించారు. 1.31 కిలోమీటర్ల పొడవు, 8.83 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీని, 9 మోటార్లతో నిర్మిస్తున్న పంప్ హౌజ్ ను సీఎం పరిశీలించారు. బ్యారేజీలు, పంప్ హౌజ్ ల నిర్మాణం జరుపుతూనే.. అదే సమయంలో అవసరమైన గేట్లను తయారు చేయించి బ్యారేజీ నిర్మాణ స్థలానికి తరలించాలన్నారు. మోటార్లను కూడా తెప్పించాలని చెప్పారు.

విద్యుత్ శాఖ పనితీరుపట్ల సీఎం సంతృప్తి
ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్ ను సరఫరా చేయడానికి రికార్డ్ స్థాయిలో సకల ఏర్పాట్లు చేసిన విద్యుత్ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అనుబంధంగా నిర్మిస్తున్న పంప్ హౌజ్ ల వద్ద నిర్మిస్తున్న సబ్ స్టేషన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు విద్యుత్ శాఖ తరపున చేసిన ఏర్పాట్లను వివరించారు.

మేడిగడ్డ పంప్ హౌజ్ నడవడానికి 440 మెగావాట్ల విద్యుత్ అవసరమని నిర్ణయించామని, ఇందుకోసం  220  కె.వి. సబ్ స్టేషన్ నిర్మించామని, 80 కిలోమీటర్ల మేర 220 కె.వి. డబుల్ సర్క్యూట్ లైన్ కొత్తగా వేశామని ప్రభాకర్ రావు చెప్పారు. సబ్ స్టేషన్ తో పాటు ఇతర నిర్మాణాలు పూర్తి కావొచ్చాయని, వచ్చే ఏడాది మార్చిలోగా నూటికి నూరు శాతం పనులు పూర్తవుతాయన్నారు.

అన్నారం పంప్ హౌజ్ కు 320 మెగావాట్ల విద్యుత్ అవసరమని నిర్ణయించామని, ఇక్కడ కూడా  220 కె.వి. సబ్ స్టేషన్ ను, 28 కిలోమీటర్ల మేర కొత్త డబుల్ సర్క్యూట్ లైన్ ను నిర్మిస్తున్నట్లు ప్రభాకర్ రావు చెప్పారు. సుందిళ్ల పంప్ హౌజ్ కు 360 మెగావాట్ల విద్యుత్ అవసరమని, ఇందుకోసం 400 కె.వి.సబ్ స్టేషన్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ నుండి సుందిళ్ల వరకు 400 కె.వి. డబుల్ సర్క్యూట్ లైన్ ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

సుందిళ్లలో నిర్మించే 400 కె.వి. సబ్ స్టేషన్ నుండే మేడిగడ్డ, అన్నారం పంప్ హౌజ్ లకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ప్రభాకర్ రావు చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు అవసరమయ్యే విద్యుత్ ను సమకూర్చుకోవడానికి ఏర్పాట్లు చేశామన్నారు. 2018 మార్చి నాటికి విద్యుత్ శాఖ పనులన్ని పూర్తవుతాయని, ఎత్తిపోతల పథకాల కోసం డెడికేటెడ్ లైన్లు, సబ్ స్టేషన్లు, పవర్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎండీ వివరించారు.

ఎత్తిపోతల పథకాలకు కావలసిన విద్యుత్ విషయంలో ముందస్తు అంచనాలు రూపొందించుకుని పక్కా ప్రణాళికలు అమలు చేయడం వల్ల అనుకున్న సమయంలో పనులు పూర్తవుతున్నాయని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాల్లో మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, ఇతర ప్రజా ప్రతినిధులు, డీజీపీ మహేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఇ.ఎన్.సి. మురళీధర్, సిఇ వెంకటేశ్వర్లు, ఎన్.పి.డి.సి.ఎల్. సీఎండీ గోపాల్ రావు, ట్రాన్స్ కో డైరెక్టర్లు జగత్ రెడ్డి, సూర్యప్రకాష్, మంచిర్యాల, పెద్దపల్లి కలెక్టర్లు కణ్ణన్, ప్రభాకర్ రెడ్డి, ఎల్ అండ్ టి చైర్మన్ సుబ్రమణ్యం, మెగా కంపెనీ ఎండి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.