బీసీల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టి

అన్ని వర్గాలను.. అట్టడుగు నుంచి ఉన్నతస్థాయికి తీసుకొచ్చిన్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని భావిస్తున్న సీఎం కేసీఆర్‌ ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జనాభాలో సగానికంటే ఎక్కువగా ఉన్న బీసీలపై సీఎం దృష్టి కేంద్రీకరించారు. బీసీల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకాలు ఎలా అమలవుతున్నాయి? ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇంకా ఏమి చేయాలి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించేందుకు రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా సీఎం కేసీఆర్ బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. పార్టీలకు అతీతంగా ఎలాంటి భేషజాలకు తావీయకుండా.. బీసీ ప్రజాప్రతినిధులందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారు. అసెంబ్లీలోని ఒకటో నంబరు కమిటీహాలులో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న ఇప్పటికే రాష్ట్రంలోని బీసీ ప్రజాప్రతినిధులకు లేఖలు రాశారు. సీఎం కేసీఆర్ ఈ సమావేశం ఎందుకు ఏర్పాటుచేస్తున్నారో ఆ లేఖలో వివరించారు. బీసీల సమస్యలపై సూచనలు చేయాలంటూ లేఖలో కోరారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన బీసీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించటంతో దాదాపు 40 మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉంది.

సమావేశానికి సంబంధించిన ఎజెండా కూడా సిద్ధమైంది. సమావేశం ప్రారంభం కాగానే.. రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి, సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు, పథకాలపై ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఆ తర్వాత 2017-18 బడ్జెట్‌కు సంబంధించిన ఎకనామిక్ సపోర్ట్ స్కీములపై లోతుగా చర్చించే అవకాశం ఉంది. నాయీ బ్రాహ్మణులకు 250 కోట్లు, రజకులకు 250 కోట్లు, ఎంబీసీలకు 1000 కోట్లు కేటాయించటంపై చర్చిస్తారు. సంచార జాతులు, విశ్వ బ్రాహ్మణ, శాలివాహన లాంటి కులాలపై, వడ్డెర, సగర లాంటి ఫెడరేషన్లు, బోయ, వాల్మీకీ, క్రిష్ణబలిజ, పూసల, భట్రాజు, మేదర, గీత కార్మికులు లాంటి ఇతర ఎంబీసీలపై లోతుగా చర్చిస్తారు. ఫెడరేషన్లకు సంబంధించి భవిష్యత్తు యాక్షన్ ప్లాన్లను చర్చిస్తారు.

బీసీలకు సాధారణంగా ప్రభుత్వపరంగా అందే పథకాలతోపాటు.. ప్రత్యేకంగా ఫెడరేషన్లు, కార్పొరేషన్ల ద్వారా అట్టడుగువర్గాలను ఉన్నతస్థాయికి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ పలు పథకాలను అమలుచేస్తున్నారు. బీసీల కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా.. ఇప్పటికే 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపించారు. చేనేతకు1,200 కోట్లు కేటాయించారు. నేతన్నకు చేయూతనిస్తూ.. భారీగా సర్కారు నుంచి ఆర్డర్లు ఇస్తున్నారు. చేనేత రుణమాఫీని అమలుచేస్తున్నారు. పొదుపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూలుపై సబ్సిడీ ఇస్తున్నారు. నాయీ బ్రాహ్మణులకు భారీగా బడ్జెట్ కేటాయించి.. ఆధునిక సెలూన్లను సమకూరుస్తున్నారు. రజకులకు అత్యాధునిక వాషింగ్ మెషిన్లను అందించేలా పథకాన్ని అమలు చేస్తున్నారు. గీతపనివారి జీవితాలకు భద్రత కల్పించేలా, ఆర్థిక భరోసా లభించేలా చర్యలు తీసుకొన్నారు.

వెనుకబడిన తరగతుల్లో అత్యంత వెనుకబడిన కులాలు అనేకం ఉన్నాయి. అనేక సంచార జాతులున్నాయి. కొన్ని కులాలకు సంబంధించి పూర్తిగా సర్వే చేయాల్సి ఉన్నది. సంచారజాతులు, అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమం కోసం ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఎంబీసీలను ఉన్నతస్థాయికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. అందుకు కార్యాచరణ కూడా రచించారు. ఈ సమావేశంలో బీసీల కోసం రూపొందించిన పథకాలను మరింత ప్రభావవంతంగా అమలుచేసేందుకు అవసరమైన సూచనలను, సలహాలను ప్రభుత్వం స్వీకరించనుంది.