ప్రధానిపై మణిశంకర్‌ ‘నీచ్‌’ వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌ చేసిన కామెంట్లు వివాదంగా మారాయి. స్వయంగా ప్రధానిని పట్టుకొని మణిశంకర్ అయ్యర్‌ అవమానకరమైన కామెంట్లు చేశారు. అంబేడ్కర్ విషయంలో ప్రధాని మోడీ రాజకీయం చేస్తున్నారని విమర్శలు చేసే క్రమంలో ఆయన లైన్‌ దాటారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ కుటుంబం…అంబేడ్కర్‌ ఆకాంక్షలను నిజం చేసేలా కృషి చేసిందని…అలాంటి కుటుంబాన్ని ప్రధాని మోడీ విమర్శించటమేమిటని ప్రశ్నించారు. ఈ క్రమంలో ప్రధాని మోడీని నీచుడు, సభ్యత లేని వాడని…నీచ రాజకీయాలు చేసేవారు మనకు అవసరమా అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ కామెంట్లకు ప్రధాని మోడీ సరైన కౌంటర్‌ ఇచ్చారు. గుజరాత్ లోని సూరత్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఈ కామెంట్లను ప్రస్తావించారు. గుజరాత్ ప్రజలను నీచంగా చూస్తు, గాడిదలు, పురుగులతో పోల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పేదరికాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందన్నారు. సీఎం గా కానీ పీఎం గా కానీ ప్రజలు తలదించుకోనేలా ఎప్పుడైనా ప్రవర్తించానా అని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్‌ కు ఎన్నికల్లో సరైన బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఐతే రాహుల్ గాంధీ మాత్రం ఈ వివాదంపై హుందాగా స్పందించారు. మణిశంకర్ వ్యాఖ్యలను తాను సమర్థించటం లేదని తేల్చిచెప్పారు. నిరంతరం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడానికి బీజేపీ, పీఎం చెత్త భాషను ఉపయోగిస్తూ ఉంటారు. కాంగ్రెస్‌కు ప్రత్యేకమైన సంస్కృతి, వారసత్వం ఉన్నాయి. ఇలాంటి బాషను తాము ఉపయోగించమని రాహుల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రధాని మోడీకి మణిశంకర్ అయ్యర్‌ క్షమాపణ చెప్పాలని కోరారు.

రాహుల్ ట్వీట్ తర్వాత మణిశంకర్ అయ్యర్‌ రియాక్ట్‌ అయ్యారు. తాను ఇంగ్లీష్‌ లో  లో లెవల్ అనటానికి బదులు హిందిలో నీచ్‌ అనే పదాన్ని వాడనని…తన ఉద్దేశం ప్రధాని దిగజారి మాట్లాడుతున్నారని మాత్రమేనని హిందీ సరిగా రాకపోవటంతో ఇలా అనాల్సి వచ్చిందన్నారు.