ప్రతి వర్గానికి న్యాయం చేయటమే లక్ష్యం

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలను అభివృద్ధి బాటలో నడపాలనేదే ప్రభుత్వ సంకల్పం అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ప్రతి వర్గానికి న్యాయం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన అవేర్ నెస్ వాక్ లో మంత్రి జోగు రామన్నతో కలిసి ఆయన పాల్గొన్నారు. దివ్యాంగులు సకలాంగులకంటే వెయ్యి రెట్లు గొప్పవారని స్పీకర్ అన్నారు. మానవ సంపదను, మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దివ్యాంగుల పాత్ర చాలా కీలకమని చెప్పారు.

సమాజానికి మేలు చేయనివాడే అసలైన వికలాంగుడు అని మంత్రి జోగు రామన్న వ్యాఖ్యానించారు. వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. వికలాంగుల కొరకు ప్రత్యేక ఐటి పార్క్ ని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో కూడా వికలాంగులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఉపాధితోనే దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపగలుగుతామని అన్నారు. రాష్ట్రంలో 4లక్షల 75 వేల మంది దివ్యాంగులకు ప్రభుత్వం నెలకు రూ.1500 చొప్పున ఆసరా పింఛన్లు ఇస్తోందని వివరించారు. దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.