పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు

రాష్ట్రంలోని నిరుపేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మించి ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రంలో 2 లక్షల 72 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మహబూబ్‌నగర్  జిల్లా  క్రిస్టియన్‌పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను 320 మంది లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశం చేయించారు.  పేదలందరికీ ఇంటి ఖర్చు, పెళ్లి ఖర్చు లేకుండా సీఎం కేసీఆర్ పెద్దన్నలా ఆదుకుంటున్నారని మంత్రి తెలిపారు.  గతంలో ఇండ్లు కడితే లబ్దిదారులు అప్పుల పాలయ్యేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ప్రభుత్వమే ఇండ్లు కట్టించి ఇస్తుందని చెప్పారు.

ఇవాళ ఉదయం నుంచి మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో వైద్యకళాశాల నిర్మాణానికి, బైపాస్ రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మినీ ట్యాంక్‌బండ్‌ను, మయూరి పార్కులో హంస కొలను, జిప్ సైకిల్, ఆర్చరీ, రైఫిల్ షూట్, జిమ్ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.