పెళ్లి వేడుకలో ప్రియుడితో శృతి సందడి!

హీరోయిన్ శ్రుతిహాసన్‌ తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న మైఖేల్‌ కోర్సేల్‌తో కలిసి ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. తమిళ నటుడు ఆదవ, వినోదినిల వివాహం మంగళవారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు రాధిక, ప్రసన్న, ఎ.ఆర్‌. మురుగదాస్‌ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇదే శుభకార్యానికి శ్రుతి.. లండన్‌కు చెందిన నటుడు మైఖేల్‌ను కూడా తీసుకొచ్చారు. వీరితోపాటు కమల్‌హాసన్‌ కూడా ఉన్నారు. పెళ్లిలో ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. శ్రుతి ఎరుపురంగు చీరలో మెరిశారు. మైఖేల్‌ భారత సంప్రదాయం ప్రకారం పంచెకట్టులో కనిపించారు. మైఖేల్‌తో ప్రేమ వ్యవహారంపై వస్తోన్న వార్తల గురించి శ్రుతి ఇటీవల ఓ పత్రికతో మాట్లాడారు. ఇలాంటి వాటిని పట్టించుకోనని అన్నారు. తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పడం ఇష్టంలేదని చెప్పారు. మైఖేల్‌ను శ్రుతి తన తల్లి సారికకు పరిచయం చేశారని, త్వరలోనే పెళ్లి జరగబోతోందని ఇటీవల వార్తలు పుట్టుకొచ్చాయి. వీరు ముగ్గురు కలిసి ఉన్న ఫొటోలు కూడా అప్పట్లో బయటికి వచ్చాయి. శ్రుతి ప్రస్తుతం ‘శభాష్‌ నాయుడు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను కూడా కమలే నిర్వర్తిస్తున్నారు.