పెళ్లి వార్తల్లో నిజం లేదట!

భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఈ నెల 12న తన ప్రేయసి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మను వివాహం చేసుకోబోతున్నాడన్న వార్త వైరల్‌గా మారింది. ఈ వేడుక ఇటలీలో జరగనుందని, ఇందుకోసం కోహ్లీ గురువారమే ఇటలీ బయల్దేరుతున్నాడన్న ప్రచారం ఒక్కసారిగా వూపందుకుంది. ఈ వార్తలపై అనుష్క శర్మ మేనేజర్‌ స్పందించారు. మీడియాలో వారిద్దరి పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలను ఖండించారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అంతకుముందు వీరిద్దరూ ఒక్కటవుతారన్న ప్రచారం జరిగింది. శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లకు కోహ్లీ అందుబాటులో లేకపోవడం ఇందుకు మరింత బలాన్నిచ్చింది. అనుష్కతో పెళ్లి కోసమే కోహ్లీ సెలవు తీసుకున్నాడని ప్రచారం జరిగింది. ఇటలీలో జరగనున్న ఈ వివాహానికి కోహ్లీ కుటుంబసభ్యులు, స్నేహితులు ఏకంగా టికెట్లు కూడా బుక్‌ చేసుకున్నారని వూహాగానాలు వినిపించాయి. ఈ ప్రచారాన్ని అనుష్క మేనేజర్‌ ఖండించడంతో ప్రచారానికి తెరపడినట్లయ్యింది. గతంలోనూ వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ప్రచారం జరిగింది.