పాలస్తీనాలో చిచ్చు పెట్టిన ట్రంప్

గత కొన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్న పాలస్తీనాలో చిచ్చుపెట్టారు అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్‌. తన వివాదస్పద నిర్ణయంతో ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టారు. ఇన్నాళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న జెరూసలెంను.. ఇజ్రాయిల్‌ పూర్థిస్థాయి రాజధానిగా ప్రకటించడంపై పాలస్థీనా భగ్గుమంటోంది. ట్రంప్ నిర్ణయంతో మత యుద్ధాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉగ్రవాదులు సైతం మళ్లీ రెచ్చిపోయే ప్రమాదం ఉందని, అదే జరిగితే.. పాలస్థీనా కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు ఆ దేశ ప్రెసిడెంట్‌ మహ్మద్‌ అబ్బాస్‌.

ఇజ్రాయిల్‌-పాలస్థీనా మధ్య శాంతి చర్చల్లో పాల్గొనే అవకాశం అమెరికా కోల్పోయిందని పాలస్థీనా లిబరేషన్‌ ఆర్గనైసేషన్  స్పష్టం చేసింది. రెండు రాజ్యాలు ఏర్పాటు కాకుండా ట్రంప్‌ విధ్వంసక నిర్ణయం తీసుకున్నారని మండిపడింది. డొనాల్డ్ ట్రంప్‌ తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఇదేనని అభివర్ణించింది. తమను సంప్రదించకుండా ట్రంప్‌ ఎలా నిర్ణయం తీసుకుంటారని పాలస్థీనా చర్చల ప్రతినిధి సాహెబ్‌ ఎరెకత్‌ ప్రశ్నించారు. సమస్య పరిష్కారం కాకుండా ఇజ్రాయిల్‌  అధికారులు వ్యవహరించడంతోనే ట్రంప్ రెచ్చిపోయారని ఆరోపించారు.

అంతర్జాతీయంగా సైతం తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ట్రంప్ నిర్ణయంపై సౌదీ రాజు సల్మాన్, ఈజిప్టు అధ్యక్షుడు అల్‌ సిసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ చర్య చట్ట వ్యతిరేకమని, ప్రమాదకరమని ఇరాన్‌ ప్రెసిడెంట్‌ హసన్‌ రౌహాని విమర్శించారు. అమెరికా మిత్రపక్షమైన యూరప్‌తో పాటు ఐక్యరాజ్యసమితి ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఇజ్రాయిల్‌- పాలస్థీనా మధ్య శాంతిచర్చలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లేనని అంటున్నాయి అరబ్‌ దేశాలు.

జెరూసలెం మూడు మతాలకు పవిత్ర స్థలం. క్రైస్తవులు, యూదులు, ముస్లింలు ఈ నగరాన్ని పవిత్రంగా భావిస్తారు. హోలీ సిపల్చర్‌ చర్చిని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పవిత్ర స్థలంగా భావిస్తారు. చర్చిలోని క్రీస్తు సమాధిని సందర్శించేందుకు లక్షలాది మంది క్రిస్టియన్లు ప్రతి ఏడాది ఇక్కడకు వస్తుంటారు. ఇక పాత నగరంలోని అల్‌ అక్సా మసీదు.. ముస్లింలకు మూడో పవిత్ర స్థలం. మక్కా నుంచి మహ్మద్‌ ప్రవక్త ఇక్కడకు వచ్చి అందరి కోసం ప్రార్థనలు చేసినట్లు ముస్లింలు భావిస్తారు. జెరూసలెంలోని వెస్ట్రన్‌ వాల్‌ యూదులకు పవిత్ర స్థలం. ఈ ప్రాంతంలోనే సున్నపురాయి గోడ ఉంది. భూగోళం ఇక్కడ నుంచే పుట్టిందని యూదులు భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు దీనిని దర్శించుకుంటారు.