పనిచేయని రేషన్ డీలర్లను తొలగించండి

పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీకి విముఖంగా ఉన్న డీలర్లను వెంటనే తొలగించి, కొత్త డీలర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డీలర్లు డిడిలు కట్టని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించింది. సమ్మె పేరుతో రాష్ట్రంలో కొంత మంది డిడిలు కట్టకపోవడం వల్ల డిసెంబర్ నెలలో పేదలకు నిత్యవసర సరుకులు అందని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై  ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ..పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజెందర్, కమిషనర్ సివి ఆనంద్ లతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 వేల మంది డీలర్లలో 25 జిల్లాలకు చెందిన దాదాపు 7 వేల మంది ఇప్పటికే డిడిలు కట్టి, సరుకుల పంపిణీకి సిద్ధమయ్యారు. మిగతా వారు మాత్రం వేతనాలు పెంచాలని, హెల్త్ కార్డులు అందించాలనే డిమాండ్లతో డిడిలు కట్టలేదు. డిసెంబర్ నెలలో సరుకుల పంపిణీకి వారు విముఖంగా ఉన్నారు. దీంతో కొన్ని చోట్ల పేదలకు డిసెంబర్ నెల సరుకులు అందించే పరిస్థితి లేదని సీఎం కేసీఆర్ కు అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి డిడిలు కట్టిన డీలర్లకు సరుకులు యధావిధిగా సరఫరా చేయాలని చెప్పారు. డిడిలు కట్టని డీలర్లను వెంటనే తొలగించి, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. డిడిలు కట్టని ప్రాంతాల్లో ప్రజలకు సరుకులు అందని పరిస్థితి రావద్దన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సరుకుల పంపిణీ కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం కేవలం రూపాయికి కిలో చొప్పున ప్రతీ ఒక్కరికి ఆరు కిలోల బియ్యం అందిస్తున్నదన్నారు సీఎం కేసీఆర్.  దీనికోసం వేల కోట్ల భారాన్ని భరిస్తున్నదన్నారు. ఈ సరుకుల పంపిణీ కోసం డీలర్లు కమిషన్ పద్ధతిన పనిచేస్తున్నారని చెప్పారు. కానీ రేషన్ డీలర్లు అసమంజసమైన కోరికలు కోరుతూ, సమ్మె చేస్తామనడం బాధాకరమన్నారు. ఈ సమ్మె పిలుపుకు అర్థం లేదన్న సీఎం.. డీలర్ల చర్య వల్ల పేదలకు సరుకులు అందని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిడిలు కట్టిన వారికి వెంటనే సరుకులు పంపించి, డిడిలు కట్టని వారిని తొలగించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.