నేటితో గుజరాత్ ఎన్నికల ప్రచారానికి తెర

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారం ఇవాళ్టితో(గురువారం) ముగియనుంది. మొత్తం 182 స్థానాలకు గానూ 89 సీట్లకు శనివారం (ఈ నెల 9న) ఎన్నికలు జరగనున్నాయి. సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్‌, కచ్‌ ప్రాంతాల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం 977 మంది బరిలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఎన్నిక కానున్న రాహుల్‌ గాంధీలు ఈ ఎన్నికలను వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకొని ప్రచారం చేశారు. సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో అధిక స్థానాలు ఉండడంతో ఇక్కడ ఆధిక్యత సంపాదించడం అన్ని పార్టీలకు ప్రాధాన్యంగా మారింది. ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖుల్లో ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఒకరు. ఆయన రాజ్‌కోట్‌ (పశ్చిమ) నుంచి పోటీ చేస్తుండగా, అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఇంద్రనీల్‌ రాజ్యగురు రంగంలో ఉన్నారు. ముస్లింలు అధికసంఖ్యలో ఉండే మాండ్వీలో ప్రముఖ రాజ్‌పుట్‌ నాయకుడు శక్తిసిన్హ్‌ గోహిల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాజకీయాలకు కొత్త అయిన మరో రాజ్‌పుట్‌ నాయకుడు వీరేంద్ర సిన్హ్‌ జడేజా భాజపా అభ్యర్థిగా ఆయనతో తలపడుతున్నారు. సౌరాష్ట్ర- పశ్చిమ గుజరాత్‌లలో ప్రధాని మోడీ14 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. వారం రోజుల పాటు రాహుల్‌ ప్రచారం చేశారు.