నిఘా నీడలో రిజిస్ట్రేషన్లు

రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక అడుగు ముందుకేసింది. ఇకపై రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరింత పారదర్శకత అమలు కానుంది. రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సోమవారం నుంచి కెమెరాల నిఘా కిందకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్ చిక్కడపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కెమెరాల నిఘాలో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్న రాష్ట్ర సర్కారు.. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసేందుకు సర్వం సిద్ధంచేసింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్ ముందు, వెనుక ఒక్కో కెమెరాను అమర్చారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేట్ డాటా సెంటర్‌లో ప్రత్యేక సర్వర్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు కలిపి ఉమ్మడిగా ఉన్న సర్వర్‌ను ఇప్పుడు వేరు చేశారు. కొత్త సర్వర్‌కు మొత్తం డాటాను అనుసంధానం చేసే పని దాదాపుగా పూర్తయింది. దీనికోసం స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు శుక్రవారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. నాటినుంచి మూడురోజులపాటు యుద్ధప్రాతిపదికన డాటా బదిలీ చేపట్టారు. సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కెమెరాల నిఘా కిందకు వస్తున్నాయి.

సాఫ్ట్‌ వేర్, హార్డ్‌ వేర్ల మార్పువంటి పనులను స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ జాయింట్ కమిషనర్ వేముల శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు. కొత్తగా వెబ్ కెమెరాలు, స్కానర్లు, ప్రింటర్లు, ప్రత్యేక సర్వర్, డెడికేటెడ్ లైన్లతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత వేగంగా జరుగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 144 సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆరు డీఐజీ కార్యాలయాల్లో ఇండియన్ రైల్వేకు చెందిన రెయిల్‌ టెల్ సాఫ్ట్‌ వేర్ సంస్థ డెడికేటెడ్ లైన్లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రెయిల్‌ టెల్‌కు ఏడాదికి రూ.1.20 కోట్లు చెల్లించనుంది. ఇంతవరకు లీజ్డ్ లైన్ల వల్ల తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తేవి. కానీ డెడికేటెడ్ లైన్ల ఏర్పాటుతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్టేనని అధికారులు చెప్తున్నారు.

ప్రస్తుతం 90 శాతం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. అవికూడా ఇరుకుగా ఉండటం, ఆ శాఖలో కొన్నిపోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు వీడియో చిత్రీకరణను అమలుచేసి సీడీ ఇవ్వడం సాధ్యంకాదని పలు ఉద్యోగసంఘాల నాయకులు ఆ శాఖ కమిషనర్‌కు నివేదించారు. దీంతో తాత్కాలికంగా వీడియో చిత్రీకరణను వాయిదా వేసినట్టు తెలిసింది. కొత్త భవనాల నిర్మాణం, ఖాళీల భర్తీ పూర్తయిన వెంటనే వీడియో చిత్రీకరణ అమలు చేయాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఉమ్మడి ఏపీలో నిర్లక్ష్యానికి గురైన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను.. రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ప్రభుత్వ చర్యలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వేగాన్ని పెంచి, మరింత పారదర్శకతను తీసుకొస్తాయని అంటున్నారు.