దివ్యాంగుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

డబుల్ బెడ్ రూం ఇళ్లలో దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. దివ్యాంగులు పురోగతి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అని చెప్పారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బంగారు తెలంగాణలో దివ్యాంగుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మహమూద్ అలీ తెలిపారు. దివ్యాంగుల సమస్యలను సీఎం కేసీఆర్ తో మాట్లాడి వరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణలో ఏ ఒక్కరూ అన్యాయానికి గురి కావొద్దనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దివ్యాంగులకు రిజర్వేషన్ ను 3 శాతం నుంచి 4 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకున్నామని, నెలకు రూ.1500 లు పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. మామిడిపల్లిలో 10 ఎకరాల స్థలంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఐటీ పార్కు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. వికలాంగుల కోసం ప్రత్యేక వాహనాలు అందిస్తున్నామని చెప్పారు. దివ్యాంగుల కోసం బడ్జెట్ లో కేటాయింపులు పెంచామని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలులోనూ దివ్యాంగుల కోసం వ్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, సినీ నటి జీవిత తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తుమ్మల సన్మానించారు.