దివ్యాంగులకు టిఆర్ఎస్ సర్కార్ భరోసా

దివ్యాంగుల సాధికారత విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. శారీరకంగా లేదా మానసికంగా సాధారణ జీవనం సాగించలేని నిస్సహాయులకు సర్కార్ కొండంత అండగా నిలబడింది. వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేలా చర్యలు చేపట్టింది.

1992లో ఐక్యరాజ్యసమితి (యూఎన్‌వో) తీర్మానం ప్రకారం ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వికలాంగుల అంశం విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొంది, దివ్యాంగుల హక్కుల రక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వివిధ దేశాలు తమవంతు కృషి చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వికలాంగుల సంఖ్య 2 కోట్ల 68 లక్షలు. ఇక తెలంగాణలో 10 లక్షల 46 వేల 822 మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో ప్రధానంగా ఏడు రకాల వికలాంగులు ఉన్నారు. 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం కొత్తగా 14 రకాల వికలాంగులను జాబితాలో చేర్చారు. దాంతో రాష్ట్రంలో వికలాంగుల జనాభా 20 లక్షలకు చేరింది. దానికి తగ్గట్టే తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నది.

దివ్యాంగుల చట్టపరమైన హక్కుల పరిరక్షణకు టీఆర్ఎస్ ప్రభుత్వం నడుం బిగించింది. చట్టం అమలుకు తగిన నియమాలను రూపొందించి, పూర్తి స్థాయిలో వాటి అమలుకు కృషి చేస్తోంది. గ్రామాల్లోని వేలాది మంది వికలాంగుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వికలాంగుల క్రీడల కోసం ప్రతి జిల్లాకు లక్ష రూపాయలు కేటాయించింది. సామాజిక భద్రతను అందించడం ద్వారా దివ్యాంగుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తోంది. ఆసరా పథకం కింద వికలాంగులకు నెలకు రూ.1500 చొప్పున దాదాపు 5 లక్షల మందికి పెన్షన్ అందిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ.900 కోట్లు ఖర్చు పెడుతోంది.

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వo వికలాంగుల సహకార సంస్థ ద్వారా రూ.8 కోట్ల వ్యయంతో వికలాంగులకు ఉపయోగపడే ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. శారీరక వికలాంగులకు మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలు, అంథ విద్యార్థులకు ల్యాప్ టాప్స్, బధిరులకు 4జీ స్మార్ట్ ఫోన్స్, ట్రై సైకిల్స్, బ్యాటరీ వీల్ చైర్స్, హియరింగ్ ఎయిడ్స్, వాకింగ్ స్టిక్స్ లాంటి పరికరాలను అందిస్తోంది.

వికలాంగులను పెళ్లి చేసుకునే వారికి ఇచ్చే ప్రోత్సాహక బహుమతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు అందిస్తోంది. విద్యార్థుల మెస్ చార్జీలను రూ.850 నుంచి రూ.1500కు పెంచింది. వికలాంగులకు 80 శాతం సబ్సిడీతో లక్ష రూపాయల ప్రత్యేక రుణ సౌకర్యం కల్పించింది. 10 లక్షల రుణానికి 50 శాతం సబ్సిడీ అందిస్తోంది. వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి 6 జిల్లాల్లో ప్రకటనలు జారీ చేసి నియామకాలు చేపడుతున్నారు. మిగతా 4 ఉమ్మడి జిల్లాల్లో కూడా త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయబోతున్నారు. అంతేకాదు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తెలంగాణ పారిశ్రామిక విధానంలో ఎస్సీ, ఎస్టీలతో సమానంగా వికలాంగులకు కూడా అన్ని రాయితీలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మొత్తంగా దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. వికలాంగుల శాఖ, వికలాంగుల సహకార సంస్థ ద్వారా దివ్యాంగుల విద్య, ఉపాధి, వైద్యం, పునరావాసం, హక్కుల కల్పనకు తగిన ప్రణాళికలను రూపొందిస్తోంది.