త్వరలో కొలువుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు!

లక్ష ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సర్కార్ మరోసారి నిరుద్యోగులకు శుభవార్త అందివ్వనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఎస్పీఎస్సీ మరో భారీ నోటిఫికేషన్ కు రెడీ అవుతోంది. త్వరలోనే మూడు వేల పోస్టులకు ప్రకటన విడుదల చేసేందుకు సమాయత్తం అవుతోంది.

రాబోయే కొత్త కొలువుల్లో పలు శాఖాల్లో ఉద్యోగావకాశాలున్నాయి. ఇందులో 1,500 గ్రూప్ 4 పోస్టులు, 700 వీఆర్వో , 210 డిప్యూటీ సర్వేయర్లు, 277 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 82 అసిస్టెంట్ ఇంజినీర్లతోపాటు ఇతర క్యాటగిరీలకు చెందిన మరికొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. . ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు పొందిన పోస్టులను భర్తీచేసేందుకు కమిషన్ కసరత్తు చేస్తున్నది.

ఇక ప్రతిష్టాత్మకంగా భూ రికార్డులు ప్రక్షాళక కార్యక్రమం చేపడుతున్న ప్రభుత్వం ఆ శాఖకు సంబంధించిన కొలువుల భర్తీకి అనుమతులివ్వటంతో టీఎస్ పీఎస్పీ 700 వీఆర్వో పోస్టుల భర్తీకి సిద్ధపడుతున్నది. దీంతోపాటుగా పలు శాఖల్లోని 1,500 గ్రూప్ 4 ఖాళీల భర్తీకి కూడా ఈ నెలలోనే ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. మహిళా, శిశు సంక్షేమశాఖలోని సూపర్‌ వైజర్లు, రెవెన్యూశాఖలోని డిప్యూటీ కలెక్టర్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖలోని జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్ల భర్తీ ప్రక్రియను కూడా చేపట్టనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించి అందిన వివరాలను టీఎస్‌పీఎస్సీ సమీక్షించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భర్తీ ప్రక్రియ తుదిదశకు చేరిన ఉద్యోగాలను పూర్తిచేసి అనంతరం తాజా నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది.