తొలి గుండెమార్పిడి జరిగి యాభై ఏళ్లు!

గుండె మార్పిడి. ప్రపంచ వైద్య చరిత్రలో సంచలనం. ఆధునిక వైద్యంలో కీలక పరిణామం. తొలిసారి ఒక వ్యక్తి నుంచి సేకరించిన గుండెను మరొకరికి అమర్చిన అరుదైన ఘటనకు 50 ఏళ్లు నిండాయి. 1967 డిసెంబర్ 3న సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరిగిన ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ అవయవ మార్పిడికి సంబంధించి అపోహల్ని దూరం చేసింది. డాక్టర్ బర్నార్డ్ స్ఫూర్తితో ఇప్పటికి ఎన్నో ప్రాణాలు నిలిచాయి.

1967  డిసెంబర్‌ 3. వైద్య చరిత్రలోనే ఓ సంచలనం. ప్రపంచంలోనే మొట్టమొదటి మానవ గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైన రోజది. సౌతాఫ్రికా కేప్‌టౌన్‌లోని గ్రూట్‌షూర్‌ హాస్పిటల్‌ ఈ అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. వైద్య రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. అవయవ మార్పిడికి సంబంధించి అప్పటి వరకున్న అపోహలన్నింటినీ పటాపంచలు చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది.

సౌత్‌ ఆఫ్రికాకు చెందిన లూయిస్‌ వాష్‌ కాన్‌స్కీ డెంటిస్ట్‌ గా పనిచేసేవారు. మూడుసార్లు హార్ట్‌ స్ట్రోక్‌ రావడంతో ఆయన గుండె తీవ్రంగా దెబ్బతిన్నది. అప్పటికి లూయిస్‌ వయసు 53. ట్రీట్‌మెంట్‌ కోసం గ్రూట్‌షూర్‌ హాస్పిటల్‌లో చేరిన ఆయనను పరిశీలించిన డాక్టర్లు చేతులెత్తేశారు. గుండె మొరాయిస్తుండటంతో ఆయన బతకడం అసాధ్యమన్న నిర్ణయానికొచ్చారు. మహా అయితే కొన్ని నిమిషాలో, గంటలో అని తేల్చేశారు.

అయితే, 1967 డిసెంబర్‌ 2న కేప్‌టౌన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం లూయిస్‌ ప్రాణాలు కాపాడింది. బ్యాంకు ఉద్యోగి అయిన 25 ఏళ్ల డెనిస్‌ డర్వాల్‌ తన తల్లితో కలిసి రోడ్‌ క్రాస్‌ చేస్తుండగా… మద్యం మత్తులో వాహనం నడిపిన ఓ వ్యక్తి వారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డర్వాల్‌ గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న కారుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన గ్రూట్‌షూర్‌ హాస్పిటల్‌కు తరలించగా.. తలకు దెబ్బ బలంగా తాకడంతో డర్వాల్‌ బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆమె శరీరంలోని మిగతా అవయవాలు పనిచేస్తుండటంతో డాక్టర్లు డర్వాల్‌ తండ్రి ఎడ్వర్డ్‌ ను సంప్రదించి ఆమె గుండెను లూయిస్‌కు దానం చేయాలని కోరారు. గుండెమార్పిడితో ఆయన మరికొంత కాలం బతికే అవకాశముందని చెప్పారు. డాక్టర్ల మాటలు విన్న డర్వాల్‌ తండ్రి ఎడ్వర్డ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన కూతురి గుండె దానం చేసేందుకు ముందుకొచ్చారు. లూయిస్‌ సైతం ఓకే చెప్పడంతో రాత్రికి రాత్రే సర్జరీ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు.

అర్థరాత్రి ఒంటి గంట సమయంలో డర్వాల్‌తో పాటు లూయిస్‌ను ఆపరేషన్‌ థియేటర్‌కు తరలించారు. డాక్టర్‌ క్రిస్టియాన్‌ బర్నార్డ్‌ నేతృత్వంలో 20 మంది డాక్టర్ల బృందం సర్జరీ మొదలుపెట్టింది. ఆరు గంటల పాటు కొనసాగిన శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్యులందరిలోనూ ఉత్కంఠ. తమ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనే ఉత్సుకత. డాక్టర్ల బృందానికి నేతృత్వం వహించిన సర్జన్‌ క్రిస్టియాన్‌ బర్నార్డ్‌ శస్త్రచికిత్సలో చివరి అంకాన్ని పూర్తి చేశారు. నిశ్శబ్దం ఆవరించిన ఆపరేషన్‌ థియేటర్‌లో ఊపిరి బిగబట్టి చూస్తున్న వైద్యులను ఉద్దేశించి చెప్పిన మాటతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తొలిసారి చేపట్టిన హార్ట్‌ ట్రాన్స్‌ ఫ్లాంట్‌ సర్జరీ సక్సెస్‌ అయిందన్న వార్త గంటల వ్యవధిలోనే ప్రపంచమంతా పాకింది.

వాస్తవానికి అప్పటి వరకు కిడ్ని, లివర్‌ ట్రాన్స్‌ ఫ్లాంట్‌ సర్జరీలు జరిగాయే తప్ప మానవ గుండెను మరో మనిషికి అమర్చిన సందర్భాలు లేవు. కానీ క్రిస్టియాన్‌ బర్నార్డ్‌ నేతృత్వంలోని వైద్యబృందం డిసెంబర్‌ 3న అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. దీంతో సర్జరీలో కీ రోల్‌ ప్లే చేసిన డాక్టర్‌ బర్నార్డ్‌ వాల్డ్‌ ఫేమస్‌ అయిపోయారు. హార్ట్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ జరిగిన 33 గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన లూయిస్‌ డాక్టర్లతో మాట్లాడారు. 4 రోజుల తర్వాత రేడియోలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.

అయితే, గుండెమార్పిడి చికిత్స సఫలమైనా ఆయన మాత్రం ఎక్కువకాలం బతకలేదు. లూయిస్‌ శరీరం కొత్త గుండెను తిరస్కరించకుండా ఉండేందుకు ఇచ్చిన మెడిసిన్స్‌ ఆయన రోగ నిరోధక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. ఫలితంగా గుండె మార్పిడి జరిగిన 18 రోజుల తర్వాత డబుల్‌ నిమోనియాతో లూయిస్‌ కన్నుమూశారు. అయినప్పటికీ తొలిసారి విజయవంతంగా గుండెమార్పిడి చేయించుకున్న వ్యక్తిగా లూయిస్‌ వాష్‌ కాన్‌స్కీ, గుండెను దానం చేసిన మహిళగా డెనిస్‌ డర్వాల్‌  పేర్లు చరిత్రపుటల్లో నిలిచిపోయాయి.