తెలుగు మహాసభల సందర్భంగా కార్టూన్లకు ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు కార్టూన్ల ప్రదర్శన నిర్వహించనున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ ఆహ్వానం పలుకుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనకు ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాష, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక, పండుగల, సామెతల ఆధారంగా అనుకూలంగా ఉండే కార్టూన్లను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రదర్శన నిర్వాహకులుగా కార్టూనిస్టులు మృత్యుంజయ్, శంకర్, నర్సిం వ్యవహరించనున్నట్లు హరికృష్ణ చెప్పారు.

కార్టూనిస్టులు కార్టూన్లను ఎ3 సైజులో మాత్రమే వేయాలని సూచించారు. కార్టూన్లను ఈ నెల (డిసెంబర్) 10వ తేదీ లోపు  wtmscartoon@gmail.comకు  ఈ-మెయిల్ చేయాలని కోరారు. వ్యాఖ్య తెలుగులో మాత్రమే ఉండాలన్నారు. కార్టూన్ తో పాటు పేరు, ఊరు, జిల్లా పేరు, ఫోన్ నంబర్ రాసి హామీ పత్రం జత చేసి పంపాలని సూచించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారికి సర్టిఫికేట్ తో పాటు నగదు బహుమతి కూడా అందజేస్తామన్నారు. ఈ ప్రదర్శనలో ప్రదర్శింపబడే కార్టూన్లు పుస్తకరూపంలో అచ్చువేయిస్తామని తెలిపారు.

తెలుగు మహాసభల కోసం మరికొన్ని కమిటీలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల కోసం మరికొన్ని కమిటీలను ఏర్పాటు చేశారు. భాషా సదస్సుల కమిటీ, గేయతత్వ కమిటీ, అవధాన కమిటీ, మహిళా సాహిత్య కమిటీ, బాల సాహిత్య కమిటీ, చరిత్ర కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. వివిధ కార్యక్రమాల నిర్వహణలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషించనున్నాయి.