తెలంగాణ సంస్కృతి, సాహితీ వైభవం ఉట్టిపడేలా ఏర్పాట్లు

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రధాన వేదిక అయిన లాల్ బహదూర్ స్టేడియం వద్ద సాహిత్యం, సంగీత కార్యక్రమాలతో పాటు ఆహార ప్రదర్శన, అమ్మకాల కేంద్రాలు (ఫుడ్ కోర్టులు), పుస్తక ప్రదర్శన, విక్రయ శాలలు, హస్తకళల ప్రదర్శన, విక్రయ శాలలు, పురావస్తు శాఖ ప్రదర్శన ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. ఎల్.బి. స్టేడియం లోపల, బయట అలంకరణలు ఉండాలని చెప్పారు. ఎల్.బి. స్టేడియంలో తెలంగాణ సాహితీమూర్తుల కటౌట్లు ఏర్పాటు చేయాలన్నారు. తెలుగు మహాసభల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.

ఎల్.బి. స్టేడియంలో ప్రతీ రోజు సాయంత్రం సాహితీ, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు రవీంద్రభారతి, రవీంద్రభారతి మినీ హాలు, రవీంద్ర భారతి ప్రివ్యూ థియేటర్, తెలుగు విశ్వ విద్యాలయం, భారతీయ విద్యాభవన్, లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, ఎల్.బి. ఇండోర్ స్టేడియాల్లో సాహిత్య సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రారంభ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్  వస్తున్నారని, ఈ రెండు కార్యక్రమాలు ఎల్.బి.స్టేడియంలోనే నిర్వహించాలని సూచించారు. పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మహాసభల సందర్భంగా ఒకరోజు తెలుగు సినీ సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఆహార్యం, ఆహారం, సంస్కృతి, కళలు, జీవితం, పండుగలు ప్రతిబింబించేలా డాక్యుమెంటరీ రూపకల్పన చేయాలని చెప్పారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు సునిల్ శర్మ, బుర్రా వెంకటేశం, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ దినకర్ బాబు, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, కార్యదర్శి నర్సింహరెడ్డి, నగర పోలీస్ కమిషనర్ వివి శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్.బి. స్టేడియం సందర్శించారు. ప్రధాన వేదికతో పాటు మొత్తం ప్రాంగణాన్ని చూశారు. ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అధికారులకు సూచించారు.