తెలంగాణ విద్యార్థులు ప్రతిభావంతులు

నిజామాబాద్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను స్థానిక ఎంపీ కల్వకుంట్ల కవిత తిలకించారు. నిజామాబాద్ సుభాష్ నగర్ లోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో వివిధ అంశాలపై విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్స్ ఆకట్టుకున్నాయి. ఆహార పదార్థాల్లో కల్తీ ఎలా జరుగుతుంది, ఎలా గుర్తించాలనే విషయాన్ని బోధన్ శంకర్ నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నవ్య, క్రాంతి ఎంపి కవితకు వివరించారు.

ఆర్మూర్ పర్మిట్ లోని కెజిబివి స్కూలుకు చెందిన డి.వెన్నెల, ఎన్. సురక్షితలు కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడుతాయో వివరిస్తూ, పిండికూర, కొత్తిమీర, నిమ్మరసం మిశ్రమాన్ని రోజూ తాగితే రాళ్లు కరిగిపోతాయని వివరించారు. ఇంట్లోనే దోమల నివారణ మందు తయారీ, పరిసరాల శుభ్రత ఆవశ్యకత, ఆధునిక వ్యవసాయ పద్ధతులు వంటి అంశాలపై రూపొందించిన ఎగ్జిబిట్స్ ను పరిశీలించిన ఎంపి కవిత విద్యార్థులు, టీచర్లను అభినందించారు.

అనంతరం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు రూపొందించిన ఐడియల్ విలేజ్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, స్కౌట్స్ క్యాంపుకు ఉపయోగించే డేరా ను ఎంపి కవిత పరిశీలించారు.

తెలంగాణ విద్యార్థులు ప్రతిభావంతులన్నారు ఎంపీ కల్వకుంట్ల కవిత. సృజనాత్మకతకు ప్రతిభ తోడయితే అద్భుతాలు చేసి చూపించవచ్చని విద్యార్థులు రుజువు చేశారని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను విద్యార్థులు తమ ప్రదర్శనల ద్వారా వివరించారని అభినందించారు. విద్యార్థులు ప్రయోగాల ద్వారా తమ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పారు ఎంపీ కవిత.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, మేయర్ ఆకుల సుజాత, జడ్పీ డిప్యూటీ చైర్ పర్సన్ సుమనా రెడ్డి, కార్పొరేటర్లు శ్రీవాణి, విశాలిని రెడ్డి, సుదాం లక్ష్మీ పాల్గొన్నారు.