తెలంగాణ ఔన్నత్యాన్ని చాటేలా తెలుగు మహాసభలు

తెలంగాణ ఔన్నత్యాన్ని చాటేవిధంగా ప్రపంచ తెలుగు మహాసభలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ జీవన సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేసేలా రెండున్నర కోట్ల రూపాయల ఖర్చుతో డాక్యుమెంటరీని కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటైన సబ్ కమిటీ ఇవాళ ఎల్.బి స్టేడియంలో సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, అధికార భాషా సంఘం చైర్మన్ ప్రభాకర్ రావు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

హైదరాబాద్ లో ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ కోర్ కమిటీని నియమించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. దీంతో పాటు వచ్చే అతిథుల కోసం, సభా నిర్వహణ, వేదిక, అలంకరణ, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల కోసం కూడా వివిధ కమిటీలు ఏర్పాటు కావడంతో పాటు, పని కూడా మొదలు పెట్టాయని చెప్పారు. ఈ కమిటీలకు ఇప్పటికే వాటి బాధ్యతలు, జాబ్ చార్ట్, మైక్రో లెవల్ ప్లానింగ్ కూడా ఉన్నాయన్నారు. తెలుగు మహాసభల కోసం ఇప్పటికే సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ నిధులు వేదికల ఏర్పాటు, అలంకరణ, అతిథుల వసతులు, సౌకర్యాల కోసం ఖర్చుచేస్తున్నామన్నారు. ఈ నెల 7వ తేదీన సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి సమావేశమై ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లను మరింత లోతుగా సమీక్షిస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించినట్లు తెలంగాణ జీవన విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ సభలు విజయవంతం అయ్యేలా పనిచేస్తున్నామని, దీనికి అందరూ సహకరించాలని కడియం శ్రీహరి కోరారు.