తమిళనాడు, కేరళను వణికిస్తున్న ఓఖీ

ఓఖీ తుపాన్ తమిళనాడు, కేరళ రాష్ట్రాలను వణికిస్తోంది. తుఫాన్‌ ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలుల ధాటికి అక్కడక్కడ భారీ వృక్షాలు, కరెంట్ స్తంబాలు నేల కూలాయి. అరటి తోటలు సహా ఇతర పంటలు నాశనమయ్యాయి.  ఇప్పటికే ఈ తుఫాన్ ఎఫెక్ట్ కు రెండు రాష్ట్రాల్లో  పది మందికి  పైగా చనిపోయారు. తమిళనాడులో మృతి చెందిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు తమిళనాడు సీఎం పళనిస్వామి. ముందస్తు జాగ్రత్తగా తమిళనాడులోని తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు తమిళ అధికారులు. పలు రైళ్లను కూడా రద్దు చేశారు. కన్యాకుమారిలోనూ ఓఖీ తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ వర్షాలకు కన్యాకుమారీ మొత్తం నీట మునిగింది. ముంపు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడ చూసినా వరద నీరే కన్పిస్తోంది. స్థనుమలయన్‌  ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో భక్తులను టెంపుల్ లోకి అనుమతించడం లేదు.

ఇక కేరళలో ఓఖీ ప్రభావం తీవ్రంగా ఉంది. కేరళలో 80 మంది మత్స్యకారులు ఓఖి తుఫాన్ లో చిక్కుకున్నారు. వారిలో 59 మందిని ఎన్.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది రక్షించింది.  మిగతా వారికోసం అరేబియా తీరాన్నంతా ఇండియన్‌ నేవీ జల్లెడపడుతోంది. గంటలు గడిచేకొద్ది జాలర్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమవారు క్షేమంగా తిరిగి రావాలంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు.

శబరిమలలో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సన్నిధానం, పంబ దగ్గరనున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తిరువనంతపురంలోనూ కురుస్తున్న వర్షాలకు నగరమంతా జలమయమైంది. ఎన్‌.డి.ఆర్.ఎఫ్ బృందాలు వర్షాల్లో చిక్కుకుపోయిన 59 మందిని రక్షించారు.