ఢిల్లీ టెస్టులో కోహ్లీ మరో రికార్డ్!

సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేశాడు. శ్రీలంకతో ఢిల్లీలో జరుగుతున్న మూడవ టెస్టులో శతకం కొట్టాడు. విరాట్ 110 బంతుల్లో 14 ఫోర్లతో 100 రన్స్ చేశాడు. శ్రీలంకతో సిరీస్‌లో విరాట్ వరుసగా మూడు సెంచరీలు చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 20వ సెంచరీ కావడం విశేషం. హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి ఇండియన్ కెప్టెన్‌గా కూడా కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. హోమ్‌గ్రౌండ్‌లో కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు.

ఇదే టెస్ట్‌ మ్యాచ్‌లో విరాట్‌ మరో రికార్డును కూడా నెలకొల్పాడు. టెస్టుల్లో అయిదు వేల పరుగులు చేసిన 11వ భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రికార్డుకెక్కాడు. 2002లో ద్రావిడ్‌ టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ విరాట్‌ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ కూడా ఢిల్లీ టెస్టులో సెంచరీ చేశాడు. టెస్టుల్లో ఆయనకిది 11వ సెంచరీ. ఈ సిరీస్‌లో విజయ్‌కి ఇది వరుసగా రెండవ సెంచరీ.