డెబిట్‌ కార్డుల ఛార్జీలను హేతుబద్ధీకరిస్తాం!

పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ పేమెంట్స్‌ పెరుగుతున్నాయి. నగదు బదిలీతో పోలిస్తే.. డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డుల లావాదేవీలకు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ కార్డుల వల్ల అదనపు ఛార్జీల భారం తప్పట్లేదు. దీంతో ఈ ఛార్జీలను హేతుబద్ధీకరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు తెలిపింది. దీంతో పాటు డెవలప్‌మెంట్‌, రెగ్యులేటరీ పాలసీని కూడా ఆర్‌బీఐ నేడు ప్రకటించింది. ఇటీవల పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌లో డెబిట్‌ కార్డుల వాడకం పెరిగినట్లు గుర్తించామని తెలిపింది. దీంతో వాటిని మరింత ప్రోత్సహించేందుకు ఛార్జీలను హేతుబద్ధీకరించనున్నట్లు తెలిపింది.  ‘డెబిట్‌ కార్డు పేమెంట్స్‌కు ప్రోత్సాహం అందించేందుకు మర్చెంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(ఎండీఆర్‌) ఫ్రేమ్‌వర్క్‌ను హేతుబద్ధీకరించేందుకు నిర్ణయం తీసుకున్నాం. మర్చెంట్‌ కేటగిరీని బట్టి వీటిని మారుస్తాం’ అని ఆర్‌బీఐ వెల్లడించింది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు సేవలు అందిస్తున్నందుకు గానూ.. మర్చెంట్‌ నుంచి బ్యాంకులు ఎండీఆర్‌ ఛార్జీలు తీసుకుంటున్నాయి.