డీడీలు కట్టని రేషన్ డీలర్లను తొలగించండి!

రేషన్‌ డీలర్ల సమ్మెను ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. డీడీలు కట్టకుండా పేదలకు రేషన్‌ సరుకులు పంపిణీ చేయని డీలర్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. డీడీలు కట్టని డీలర్లను తొలగించడానికి రంగం సిద్దం చేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా డీలర్ల జాబితాను రూపొందించే ప్రక్రియను పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసింది. ఇప్పటికే  ఈ విషయంపై సమీక్ష చేసిన సీఎం కేసీఆర్.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీడీలు కట్టిన డీలర్లకు సరుకులు యధావిధిగా సరఫరా చేయాలని చెప్పారు. డీడీలు కట్టని డీలర్లను వెంటనే తొలగించి, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. డీడీలు కట్టని ప్రాంతాల్లో ప్రజలకు సరుకులు అందని పరిస్థితి రావద్దన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సరుకుల పంపిణీ కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. రేషన్‌ సరుకుల కోసం డీడీలు కట్టని డీలర్లకు రేపటి వరకు గడువు విధించింది. రేపటి వరకు  దారికిరాని డీలర్లను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. 3వ తేదీ నుండి వారి స్థానంలో కొత్తవాళ్ల నియామక ప్రక్రియను చేపట్టాలని కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సి.వి. ఆనంద్‌ సూచించారు. డీడీలు కట్టకుండా సమ్మెలో పాల్గొంటున్న వారి వివరాలను, అలాగే డీడీలు కట్టి సరుకులు పంపిణీ చేయకుండా ఉన్న డీలర్ల జాబితాను రూపొందించాలని చెప్పారు. ఏయే ప్రాంతంలో డీలర్లు సమ్మెకు వెళ్తున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలకు వ్యూహరచన చేయాలన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పేద ప్రజలకు సరుకులు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్  సీవీ ఆనంద్ అధికారులకు సూచించారు.