డిజిటల్ స్క్రీన్లపై తెలుగు మహాసభల సమాచారం

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభల సందడి మొదలయింది. 100 మంది తెలంగాణ కవులు, వైతాళికులు, కళాకారులు, ప్రముఖుల పేర్లతో తోరణాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మహాసభల కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మహాసభలకు సంబంధించి డిజిటల్ స్క్రీన్ ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది. సభ వేదికలు ఎక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించిన రూట్ మ్యాప్ లను కూడా మనం ఈ డిజిటల్ స్క్రీన్ ద్వారా తెలుసుకోవచ్చు.

తెలంగాణ చరిత్ర, కవులు, రచయితలు, సంస్కృతికి సంబంధించిన వివరాలను కూడా స్క్రీన్లపై పొందుపరిచారు. మహాసభల ప్రారంభం నాటికి ప్రతి వేదిక వద్ద ఈ స్క్రీన్ లను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర చరిత్ర తెలుగు సాహిత్య చరిత్ర, మహాసభలకు సంబంధించి ముఖ్యమైన ఫోన్ నెంబర్లను కూడా దీంట్లో పేర్కొన్నాచారు. రవీంద్రభారతిలో మొదటగా ఏర్పాటుచేసిన ఈ స్క్రీన్ వద్ద సందడి నెలకొంది. సందర్శకులు, స్కూల్ చిన్నారులు, ఔత్సాహికులు మహాసభలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.

మన రాష్ట్ర చరిత్ర, కవుల వైభవం తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్నారు అధ్యాపకులు ఇది నేటి పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను చిన్నారులు తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు. వివిధ స్కూల్స్ నుండి వస్తున్న చిన్నారులకు మహాసభల గొప్పతనాన్ని తెలుపుతున్నారు నిర్వాహకులు.