టయోటా కార్ల ధరలు మరింత ప్రియం!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) వాహన ధరలను మూడు శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ముడి సరుకులు, రవాణా చార్జీలు అధికమవడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. కార్లను తయారీ చేయడానికి అధికంగా నిధులు వెచ్చించాల్సి రావడం, తరుచుగా అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ధరలు ఒడిదుడుకులకు లోనుకావడం, విదేశీ మారకం రేట్లలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో ఉత్పాదక వ్యయంపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం సంస్థ రూ.5.2 లక్షల నుంచి రూ.1.35 కోట్ల విలువైన పలు మోడళ్లను ఢిల్లీలో విక్రయిస్తున్నది. ఇప్పటికే హోండా, ఇసుజు, స్కోడాలు తమ వాహన ధరలను లక్ష రూపాయల వరకు పెంచాయి.