జెట్ ఎయిర్‌వేస్‌కు భారీ ఎదురుదెబ్బ

దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు ఆర్థిక ఫలితాల్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.49.63 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.549.02 కోట్ల లాభంతో పోలిస్తే 91 శాతం క్షీణించింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో రూ.5,772.79 కోట్ల స్థాయి నుంచి రూ.5,758.18 కోట్లకు ఆదాయం పడిపోయినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. సంస్థకు ఇతర మార్గాల ద్వారా సమకూరే ఆదాయం 59 శాతం తగ్గి రూ.131.57 కోట్లకు పరిమితమవడం వల్లనే లాభాల్లో భారీ గండిపడిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అంతక్రితం ఏడాది ఇది రూ.578 కోట్లుగా ఉంది.