జూన్ 1 నాటికి ఐటి కారిడార్లో మెట్రో

హైదరాబాద్ మెట్రో రైలుకు వస్తున్న భారీ స్పందన నేపథ్యంలో రైళ్ళ సంఖ్యను పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ హెచ్ఎంఆర్ అధికారులను కోరారు. వచ్చే ఫిబ్రవరి నాటికి ప్రయాణీకుల సంఖ్యను బట్టి ఫ్రీక్వెన్సీని పెంచుతామని మంత్రికి హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో హెచ్ఎంఆర్ అధికారులతో మెట్రో రైలుపై కేటీఆర్ సమీక్షించారు.  పలు ఆదేశాలు జారీ చేశారు.

మెట్రో ప్రయాణీకులకు పార్కింగ్ సౌకర్యాలపైన మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా చర్చించారు. అవసరమైన మేరకు పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఉన్న పార్కింగ్ ప్రాంతాలను ప్రజలకు తెలిసేలా చర్యలు చేపట్టాలన్నారు. మెట్రో కోసం అవసరమైన మేరకు పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని హెచ్ఎంఆర్ అధికారులకు సూచించారు. మెట్రో స్మార్ట్ కార్డుల వినియోగం, ప్రయోజనాలు ప్రజలకు మరింత తెలిసేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. మెట్రో ఫీడర్ల రూట్లలో మరిన్ని బస్సులను ఏర్పాటు చేసేలా ఆర్టీసీతో మాట్లాడాలన్నారు.

మెట్రో ప్రయాణీలకుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ పైన మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో చర్చించారు. మెట్రో స్టేషన్లలో తాగునీరు, మూత్రశాలల ఏర్పాటుపైన త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పరిమితంగా ఉన్న మూత్రశాలలకు అదనంగా మరిన్ని మూత్రశాలల నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. దీంతోపాటు జూన్ 1 డెడ్ లైన్ పెట్టుకుని ఐటి కారిడార్లో మెట్రో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎక్కువ మందికి ఉపయోగపడే అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ రూట్ పైన ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. మెట్రో కారిడార్లలో చేపట్టిన ఫుట్ పాత్ ల అభివృద్ది పనులను మంత్రి సమీక్షించారు.

హైదరాబాద్ నగర ప్రజలు మెట్రో రైలును ఆహ్వానించిన తీరు, వారు మెట్రో రైలు వినియోగంలో ప్రదర్శిస్తున్న క్రమశిక్షణ పట్ల మంత్రి కేటీఆర్ కృతజ్ఘతలు తెలిపారు.