జూనియర్‌ ట్రంప్‌ తీరుపై ఆగ్రహం

అమెరికాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు.. రష్యా అధికారులతో కుమ్మక్కైన రిపబ్లికన్‌  నేతలను ఒక్కొక్కరిని విచారించేందుకు చర్యలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా హౌస్‌ ఇంటిలిజెన్స్ కమిటీ ముందు విచారణకు హాజరైన డొనాల్డ్‌ ట్రంప్‌  తనయుడు జూనియర్‌ ట్రంప్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు కాంగ్రెషనల్ ఇన్విస్టిగేటర్స్‌. అధ్యక్ష ఎన్నికల సమయంలో రష్యన్‌ లాయర్‌, మరికొందరు మధ్యవర్తులతో జరిగిన ఈ ఉత్తర ప్రత్యుత్తరాలపై ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా.. 2016 జూన్‌ లో ట్రంప్  టవర్‌ లో డొనాల్డ్ ట్రంప్‌  తో జరిగిన  భేటీపై కొశ్యన్స్‌  వేశారు.

ఐతే జూనియర్‌ ట్రంప్‌  మాత్రం ఏ ఒక్క ప్రశ్నకు సైతం సమాధానం ఇవ్వలేదు. ట్రంప్ తో జరిగిన సమావేశం తన వ్యక్తిగతం అంటూ ప్రశ్నల్ని ధాటవేశారు. ఏదైనా ఉంటే తన లాయర్‌తో మాట్లాడుకోవాలని కమిటీకి సమాధానం ఇచ్చారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఆయన నోరు విప్పకపోవడంతో.. విచారణను మధ్యలోనే ఆపేశారు కమిటీ సభ్యులు. జూనియర్‌ ట్రంప్‌ను మరోసారి విచారించేందుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించేందుకు రష్యాతో కలిసి కుట్ర చేశారని ట్రంప్‌పై ఆరోపనలు ఉన్నాయి. ఆయన పెద్ద కుమారుడు జూనియర్‌ ట్రంప్‌.. రష్యన్‌ లాయర్‌, మధ్యవర్తులతో చర్చలు జరిపారన్న ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన జూనియర్‌ ట్రంప్‌.. రష్యన్‌ నుంచి వచ్చిన ఈ మెయిల్స్‌ ను బహిర్గతం చేశారు.  హిల్లరీకి వ్యతిరేకంగా తమ దగ్గర సమాచారం ఉందని, ట్రంప్‌ విజయానికి ఇది ఉపయోగపడుతుందని రష్యన్  మీడియేటర్స్ చేసిన మెయిల్ లో ఉంది.