జనవరి మొదటి వారంలో ఎం.కె-4 ప్రారంభం

మిషన్ కాకతీయ నాలుగో దశ పనులను జనవరి మొదటి వారంలోనే ప్రారంభించాలని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. నాలుగో దశ కింద 5,703 చెరువులు పునరుద్ధరించనున్నట్టు ప్రకటించారు. మిషన్ కాకతీయలో ప్రజల భాగస్వామ్యాన్ని ఇంకా పెంచాలని మంత్రి కోరారు. మిషన్ కాకతీయపై జిల్లాల అధికారులతో సచివాలయం నుంచి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మిషన్ కాకతీయ కింద చేపట్టనున్న పనులలో సంబంధిత సాగునీటి వనరుల ఆయకట్టును స్థిరీకరణకు, అదనపు ఆయకట్టుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఎస్.ఈ, ఈ.ఈ లు క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యటించాలని, పర్యవేక్షించాలని చెప్పారు. ఇకపై పది రోజులకోసారి మిషన్ కాకతీయపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. వివిధ కారణాల వల్ల ఒకసారి తిరస్కరించిన పనులను మరోసారి పంపించే అధికారులపై తీవ్ర చర్యలు ఉంటాయని హరీశ్ రావు హెచ్చరించారు.

నాలుగో దశ పనులను ప్రారంభించేందుకు సంబంధిత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధుల టైమ్ ముందుగానే తీసుకోవాలని మంత్రి సూచించారు. నాలుగో దశ కింద తలపెట్టిన 5,703 చెరువుల పునరుద్ధరణ పనులకు ఈ నెలాఖరులోగా పరిపాలనాపరమైన అనుమతి పొందాలని ఆదేశించారు. ఇంతవరకు ప్రభుత్వానికి 2,308 పనుల ప్రతిపాదనలు అందాయని వెల్లడించారు. వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల కింది స్థాయి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని చెప్పారు. రైతు సమన్వయ సమితులను భాగస్వాములు చేయాలని మంత్రి ఆదేశించారు.

నాలుగో దశలో చేపట్టనున్న చెరువుల జాబితాను ముందుగానే వ్యవసాయ అధికారులకు అందిస్తున్నందువల్ల పూడిక మట్టిని రైతులు వాడుకునే ముందు తప్పనిసరిగా పరీక్షించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. గతంలో తెలంగాణలో కేవలం భూసార పరీక్ష కేంద్రాలు 9 మాత్రమే ఉండేవని, ఇప్పుడు ప్రతి మూడు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక సాయిల్ టెస్ట్ ల్యాబ్ ఉందన్నారు. మొత్తం 2,500 సాయిల్ టెస్ట్ ల్యాబ్ లున్నట్టు మంత్రి తెలిపారు. పూడికతీత మట్టిలో ఉండే పోషకాలపై ప్రజలు, రైతుల్లో చైతన్యం, అవగాహన తీసుకురావాలని కోరారు. ఈ మేరకు పూడికతీత మట్టిలోని పోషకాల గురించి గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట పోస్టర్లు, బ్యానర్లు ఇతర రకాలుగా ప్రచారం చేయాలని హరీశ్ రావు సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ కాకతీయలో ఇంకా సమర్ధంగా పని చేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీశ్ రావు కోరారు. కొందరు సిబ్బంది చేసే తప్పులకు మొత్తం కార్యక్రమం అభాసు పాలవుతుందని అన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో ఎక్కడా అవకతవకలు జరగకుండా చూడాలని కోరారు. ఎం.కె.4 లో అలక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఎం.కె.
ప్రభావాలపై అధ్యయనం చేసిన ‘నాబ్ కాన్’ సంస్థ పూడిక మట్టి వల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గినట్లు, వరి, కందులు, పత్తి తదితర పంటల దిగుబడి 2 నుంచి 5 క్వింటాళ్లు పెరిగినట్టు ప్రభుత్వానికి నివేదించిందని మంత్రి తెలిపారు. భూగర్భ జల సంపద కూడా అనూహ్యంగా పెరిగినట్టు తెలిపిందని వివరించారు.

ఎం.కె-4 కు సంబంధించిన పాలనాపరమైన అనుమతులు పొందే ప్రక్రియను గత నవంబర్ నుంచే మొదలుపెట్టిన విషయాన్ని  మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. ఇప్పటికే పరిపాలన పరంగా ఆమోదించిన పనులకు సాంకేతిక అనుమతులిచ్చి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. మిషన్ కాకతీయ నాలుగో దశ టైం లైన్లను విధిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 15కల్లా చీఫ్ ఇంజినీర్ కార్యాలయానికి పాలనాపరమైన అనుమతి కోసం అంచనాలు పంపాలని ఆదేశించారు. డిసెంబర్ 31 వరకు పాలనా అనుమతుల ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. జనవరి మొదటివారంలో చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభం కావాలని  ఆదేశించారు.

మిషన్ కాకతీయ రెండో, మూడో దశలో ప్రారంభించి పూర్తికాకుండా మిగిలిపోయిన చెరువులను కూడా పూర్తిచేసి తుది బిల్లులు చెల్లించాలని ఇంజినీర్లకు మంత్రి హరీశ్ రావు సూచించారు. పనుల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడొద్దని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ నాలుగో దశ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు  సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, ‘కాడా’ కమిషనర్ డాక్టర్ మల్సూర్, మైనర్ ఇరిగేషన్ సి.ఈ. లు శ్యామ్ సుందర్, సురేష్, ఇతర సి.ఈ లు లింగరాజు, వెంకటేశ్వర్లు, భగవంతరావు, మంత్రి ఓ.ఎస్.డి.శ్రీధర్ రావు దేశ్ పాండే పాల్గొన్నారు.