జనవరి నుంచి హోండా కార్ల ధర పెంపు

వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి కార్ల ధరలను 25,000 రూపాయల వరకు పెంచనున్నట్టు హోండా కార్స్‌ ఇండియా వెల్లడించింది. ముడిసరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో కార్ల ధరలను పెంచాల్సి వస్తోందని తెలిపింది. మోడల్‌ ను బట్టి కార్ల ధర 1-2 శాతం మేర పెరుగుతుందని హోండా కార్స్‌ ఇండియా ఉన్నతాధికారి తెలిపారు. ప్రారంభ శ్రేణిలో ఈ కంపెనీ విక్రయించే బ్రియో మోడల్‌ ధర 4.66 లక్షల రూపాయలుండగా.. హై ఎండ్‌లోని అకార్డ్‌ హైబ్రిడ్‌ ధర 43.21 లక్షల రూపాయలు (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ)గా ఉంది. ఇప్పటికే ఇసుజు తన వాహనాల ధరలను లక్ష రూపాయల వరకు పెంచనున్నట్టు ప్రకటించింది. 2-3 శాతం మేర ధరలను పెంచనున్నట్టు స్కోడా ఆటో ఇండియా కూడా ప్రకటించింది.